Share News

రైతు కుటుంబం నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్‌ దాకా

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:09 PM

ఆత్మస్థైర్యం ఉంటే వైకల్యాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సూదిని జైపాల్‌రెడ్డి నిరూపించా రు.

రైతు కుటుంబం నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్‌ దాకా

- సూదిని జైపాల్‌రెడ్డి 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

- ఐదు సార్లు ఎంపీగా, నాలుగు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు

- స్పష్టమైన ఉచ్చారణ, వాగ్ధాటితో అందరినీ ఆకర్షించిన సూదిని

- రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ

నాగర్‌కర్నూల్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఆత్మస్థైర్యం ఉంటే వైకల్యాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సూదిని జైపాల్‌రెడ్డి నిరూపించా రు. మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి 50ఏళ్లపాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన తన అద్భుతమైన వాగ్ధాటితో అందరి దృష్టిని ఆకర్షించారు. ఐదుసార్లు ఎంపీగా, నాలుగుమార్లు ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా కూడా కొనసాగారు.

రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత శిఖరాలకు..

కల్వకుర్తి నియోజకవర్గంలోని మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన సూదిని జైపాల్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 1942 జనవరి 16న సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు ఆయన జన్మించారు. మూడో ఏటనే ఆయనకు పోలియో సోకింది. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మాడ్గులలో.. ఇంటర్‌ వరకు దేవరకొండలో చదువుకున్న ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. అక్కడే పీజీని పూర్తి చేసిన ఆయన విద్యార్థి దశ నుంచే చురుకుగా వ్యవహరించారు. రెండుసార్లు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 1965 నుంచి 71దాకా యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు సూదిని జైపాల్‌రెడ్డికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. తాను నమ్మిన సిద్ధాంతాలను కొనసాగించిన ఆయన నిక్కచ్చితనం, పార్టీలకతీతంగా అభిమానం సంపాదించి పెట్టింది. 1969 నుంచి 1984వరకు కల్వకుర్తి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు ఆయన గెలుపొందారు. 1979లో ఇందిరాగాంధీ దేశంలో ఎమ ర్జెన్సీ ప్రకటించడంతో విబేధించిన ఆయన జనతా పార్టీలో చేరారు. 1985 నుంచి 1988వరకు జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఆయన 1984లో టీడీపీ మద్దతుతో మహబూబ్‌నగర్‌ ఎంపీగా గెలుపొందారు. రెండు మార్లు మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ స్థానం, తర్వాత మిర్యాలగూడ, చేవేళ్ల స్థానాల నుంచి కూడా గెలుపొంది రికార్డు సృష్టించారు. రెండుసార్లు రాజ్యసభకు కూడా ఆయన ప్రాతినిథ్యం వహించారు.

మంత్రివర్గంలోను తనదైన ముద్ర

ఐకే గుజ్రాల్‌, మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గాలలో పని చేసిన సూదిని జైపాల్‌రెడ్డి కేంద్రమంత్రిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఐకే గుజ్రాల్‌ క్యాబి నెట్‌లో ప్రసార శాఖ మంత్రిగా పని చేసిన ఆయన ప్రసార భారతి బిల్లును ప్రవేశపెట్టి మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆ తర్వాత కేంద్ర పట్ట ణాభివృద్ది శాఖ, పెట్రోలియం శాఖల బాధ్యతలు కూడా నిర్వ హించిన ఆయన నిత్య ప్రమాదాలు జరిగే విజయవాడ రోడ్డును ఆధునీకరించేందుకు కేంద్రం నుంచి నిధులు సాధించారు.

తెలంగాణ సాధనలో కీలకపాత్ర

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీలో లాబీయింగ్‌ నడపడంలో కూడా జైపాల్‌రెడ్డి కీలక భూమిక పోషించారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించబడే అవకాశం ఉన్నప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. తెలంగాణకు అనుకూలంగా బీజేపీ మద్దతు కూడా కూడగట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవల్సిన ఆవశ్యకతను సోనియాగాంధీకి వివరించి బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా శక్తివంచన లేకుండా కృషి చేశారు.

Updated Date - Jul 26 , 2024 | 11:09 PM