కాంచనగుహకు బంగారు కాంతులు
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:41 PM
కురుమూర్తి క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొన సాగుతున్నాయి.
- వైభవంగా కురుమూర్తి స్వామి అలంకారోత్సవం
- ఆత్మకూరు ఎస్‌బీఐ నుంచి ఆభరణాల ఊరేగింపు
చిన్నచింతకుంట, ఆత్మకూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా, చిన్న చింతకుంట మండలంలో అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొన సాగుతున్నాయి. ఉత్సవాల్లో తొలి ఘట్టమైన స్వామి వారి అలంకారోత్సవాన్ని బుధవారం కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నుంచి కురుమూర్తి స్వామి కొలువైన దేవరగట్టు వరకు నిర్వహించిన ఊరేగింపు ఘనంగా కొనసాగింది. అంతకు ముందు వనపర్తి జిల్లా ఆత్మకూరు ఎస్‌బీఐలో భద్రపరిచిన ఆభరణాల పెట్టెకు మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జి.మధు సూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ గాయత్రి, ఈవో మదనే శ్వర్‌రెడ్డి, చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాడి వంశానికి చెందిన స్వర్ణకారులు ఆభరణాల పెట్టెను తలపై పెట్టుకొని ముందు నడవగా, ఊరేగింపు ప్రారంభం అయ్యింది. ఎస్‌బీఐ నుంచి గాంధీ చౌరస్తా మీదుగా ఆత్మకూరు పరమేశ్వరస్వామి చెరువు కట్ట వరకు ఊరే గింపు కొనసాగింది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆభరణాల పెట్టెను దర్శించుకున్నారు. ఊరేగింపులో పలుకల కోలు, కట్టె కోళ్లు, భజన కీర్తనలు, కేరళ రాష్ట్ర కళాకా రులు ప్రదర్శించిన డోలు దరువు అందరినీ ఆకట్టుకున్నాయి. శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపు కొనసాగింది. చెరువు కట్ట మీదుగా ఊరేగింపు మదనాపురం మండలం కొత్తపల్లికి చేరుకున్నది. ఈ సందర్భంగా గ్రామస్థులు, భక్తులు పూలు చల్లుతూ వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం దుప్పల్లి మీదుగా మధ్యా హ్నం రెండు గంటల సమయంలో అమ్మా పురం గ్రామంలోని ముక్కెర వంశానికి చెందిన రాజా రాంభూపాల్ నివాసానికి చేరుకున్నది. అక్కడ వేద పండితులు, అర్చకులు ఆభరణాలకు ప్రత్యేక పూజలు చేశారు. మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు ఆభరణాల పెట్టెను దర్శించుకున్నారు. అక్కడి నుంచి అమ్మాపురం ప్రధాన రహదారి మీదుగా సాయంత్రం ఆరు గంటల సమయంలో ఊరేగింపు జాతర మైదానంలోని ప్రధాన రాజగోపురం గుండా దేవర గుట్టకు చేరుకున్నది. అనంతరం ఆలయ ఆవరణలో ఈవో, చైర్మన్, పాలకమండలి సభ్యులు, అధికారులు, అర్చకుల సమక్షంలో పెట్టెను తెరిచి బంగారు ఆభరణాలను ఒకొక్కటి తీస్తూ పరిశీలించారు. ఆ తర్వాత రాత్రి బంగారు కిరీటం, భుజకీర్తులు, శంఖు చక్రాలు, కోరమీసం, మొలగజ్జలు, పచ్చలు, ము త్యాల హారాలను స్వామి వారికి అలంకరిం చారు. ఆ సమయంలో కాంచనగుహ స్వర్ణ కాంతులతో విరాజిల్లింది. ఆత్మకూరు సీఐ శివకుమార్, ఎస్‌ఐ నరేందర్ నేతృత్వంలో 80 మంది పోలీసు బృం దం బందోబస్తు నిర్వహించింది. కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గౌడ్, నారాయణ పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి వివిధ పార్టీల నాయ కులు పాల్గొన్నారు.
పట్టు వస్త్రాల సమర్పణ
అమరచింత : కురుమూర్తి వేంకటేశ్వర స్వామి నామస్మరణతో పట్టు వస్ర్తాల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. వనపర్తి జిల్లా అమరచింత చేనేత కార్మికులు పక్షం రోజుల పాటు నిష్ఠతో స్వామికి పట్టు పంచె, పట్టు కండువా, పట్టు కోర్టు, అమ్మ వారికి పట్టు చీర, పట్టు రవికే, కండువాలను సిద్ధం చేశారు. ఆనవాయితీ ప్రకారం అలంకారోత్సవం రోజున వాటిని స్వామివారికి సమర్పిస్తారు. అందుకోసం బుధవారం ఉదయం పట్టు వస్ర్తాలకు కురుమూర్తి ఆలయం నుంచి వచ్చిన అర్చకులు పూజలు చేశారు. అనంతరం మార్కండేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్ర్తాలను దేవరకొండ మోహన్, నామాల నరేష్, గోవర్ధన్, దోమరవి విడతల వారీగా తలపై పెట్టుకుని ఊరేగింపుగా కురుమూర్తి కొండకు చేరుకున్నారు. కాంచన గుహలో కొలువుదీరిన కురుమూర్తి స్వామికి వస్త్రాలను సమర్పించారు. బాణసంచా మోతలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ ఊరేగింపు కొనసాగింది. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ కల్లు గీత సంఘం చైర్మన్ కేశం నాగరాజు గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, పద్మశాలి సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు దేవరకొండ లచ్చన్న, మేర్వ రాజు, క్యామ భాస్కర్, మహేందర్ రెడ్డి, చింతన్న, తాటికొండ విజయ్, దుబాయ్ వెంకటేశ్వర్ రెడ్డి, మ్యేడం కృష్ణ , అనిల్ తదితరులు పాల్గొన్నారు.