Share News

ఆర్డీఎస్‌ రైతుల్లో ఆశలు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:13 PM

ఆర్డీఎస్‌ రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.

ఆర్డీఎస్‌ రైతుల్లో ఆశలు
ఆర్డీఎస్‌ ప్రధాన ఆనకట్ట పై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

సాగుకు సిద్ధమవుతున్న ఆయకట్టు రైతులు

అయిజ, జూలై 26: ఆర్డీఎస్‌ రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో ఆర్డీఎస్‌ ప్రధాన నీటి వనరు అయిన తుంగభద్ర నదికి పెద్ద మొత్తంలో వర్షం నీరు వచ్చి చేరింది. డ్యాం నీటి నిల్వ శాతం 105.788 కాగా 103 టీఎంసీలకు చేరింది. ప్రతీ రోజు లక్షల కూసెక్కుల నీరు డ్యాంకు చేరుతుండటంతో దీనితో మూడు రోజులుగా దిగువకు నీరు వదులుతున్నారు. తుంగభద్ర నది ద్వారా వదిలిన నీరు ఆర్డీఎస్‌ ఆనకట్టకు గురువారం రాత్రి చేరింది.

ఆర్డీఎస్‌కు చేరిన నీరు..

ఈ ఆర్డీఎస్‌ ఆనకట్ట నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తోంది. గతంలో ఆర్డీఎస్‌ (రాజోళి బండ డైవర్షన్‌ స్కీమ్‌)ను కర్ణాటకలోని మాన్వీ తాలూకాలోని రాజోళి బండ గ్రామం వద్ద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మధ్యన తుంగభద్రనది ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కర్ణాటకలోని మాన్వీ తాలూకాలో 15, తెలంగాణలోని గద్వాల, అలంపూర్‌ తాలూకాలో 75, కర్నూల్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలకు సాగునీరు అందించాల్సి ఉంది. తుంగభద్ర నది వరదనీటి ద్వారా 9.30 టీఎంసీలు, తుంగభద్ర డ్యాం నుంచి 6.51 టీఎంసీల నీటి వాటా ఉంది. రబీలో 47.769 ఎకరాలకు, ఖరీఫ్‌లో 35.127 ఎకరాలకు ఆర్డీఎస్‌ నుంచి నీరు రావాల్సి ఉంది. మొత్తంగా 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రధాన ఆనకట్ట నుంచి కాలువ 42.6 కిలోమీటర్లు కర్ణాటక పరిధి, 42,6 నుంచి 142 కిలోమీటర్ల వరకు ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో ప్రధాన కాలువ సాగుతోంది. తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీరు వదలటంతో ఈ ఆనకట్టకు నీరు చేరింది. ఆనకట్ట పైభాగం నుంచి ఒకటిన్నర ఫీట్ల ఎత్తులో నీరు దిగువ తుంగభద్ర నదికి పారుతోంది.

రైతుల్లో రేకెత్తుతున్న ఆశలు

ప్రస్తుతం జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ నియోజకవర్గ రైతులు ప్రధానంగా తుంగభద్ర డ్యాంపైనే ఆశలు పెట్టుకుంటారు. డ్యాం నిండిందంటే దిగువకు నీరు వదులుతారు. ఆ నీరు ఆర్డీఎస్‌ ఆనకట్టకు నీరు చేరుకుంటుం ది. ప్రస్తుతం డ్యాం నుంచి నీరు వదలుతున్నారు. ఆనకట్ట వద్ద ఉన్న ప్రధాన కాలువ గేట్లు శుక్రవారం మధ్యాహ్నం ఎత్తి ఆర్డీఎస్‌ కాలువకు వదిలారు. శనివారం తెల్లవారుజాము వరకు తెలంగాణ సరిహద్దు చేరుకుంటుంది. నీరు కాస్త దిగువ అలంపూర్‌ నియోజకవర్గ ప్రాంతం లో అలంపూర్‌ వరకు ప్రవహించాల్సి ఉంది. నీటి సౌకర్యం ఉన్న రైతులు ఇప్పటికే నారుపోసుకొని వరి నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం నీరు వదలటంతో వారు నాట్లు వేస్తున్నారు. మరి కొంత మంది రైతులు నారు కొనుగోళ్ల కోసం వివిధ ప్రాంతాలకు పరుగెత్తుతున్నారు. ఇప్పటికే ఆర్డీఎస్‌ రైతులు వరి పంట సాగుకు పంట పొలాలను సిద్ధం చేసుకుని వరి నాటువేసేందుకు సిద్ధ్దంగా ఉన్నారు.

ఆనందంగా ఉంది

ఈ సారి గతంలో కంటే కూడా ముందస్తుగా కాలువకు నీరు రావటం ఆనందంగా ఉంది. మేము వరి నారు పోసుకోలేదు. కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి వరినారు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నాం. ఈ ఏడాది పంట దిగుబడి మంచిగానే ఉంటుందనే ఆశతో ఉన్నాము.

- బజారి, రాజాపూర్‌

Updated Date - Jul 26 , 2024 | 11:13 PM