Share News

కాసులిస్తే కోరుకున్న చోటుకు

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:24 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయులకు అడ్డగోలుగా డిప్యుటేషన్లు ఇచ్చారు. గత ఇన్‌చార్జి డీఈవో డబ్బులు తీసుకొని ఉపాధ్యాయులను కోరుకున్న చోటుకు పంపించారు. ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై పంపాలంటే ఆ స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమావేశమై, అవసరం ఉన్న చోటకు పంపించాలి.

కాసులిస్తే కోరుకున్న చోటుకు

మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్లు

రూ.50 వేల నుంచి రూ.లక్ష తీసుకొని తతంగం

జిల్లాలో 193 మంది ఉపాధ్యాయులకు డిప్యుటేషన్‌

జిల్లా బాస్‌ ఆదేశాలు లేకుండానే మౌఖిక ఆదేశాలు

గత ఇన్‌చార్జి డీఈవోకు కాసుల పంట

డిప్యుటేషన్‌పై వచ్చిన వారిని సొంత పాఠశాలలకు వెళ్లాలంటున్న హెచ్‌ఎంలు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలంలో ఎంఈవో వద్దకు పంచాయితీ

మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయులకు అడ్డగోలుగా డిప్యుటేషన్లు ఇచ్చారు. గత ఇన్‌చార్జి డీఈవో డబ్బులు తీసుకొని ఉపాధ్యాయులను కోరుకున్న చోటుకు పంపించారు. ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై పంపాలంటే ఆ స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమావేశమై, అవసరం ఉన్న చోటకు పంపించాలి. అందుకు జిల్లా బాస్‌ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ఆ నిబంధనలను ఉల్లంఘించారు. జిల్లా వ్యాప్తంగా 193 మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపగా, అందుకు సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని డీఈవో కార్యాలయ అధికారులు చెప్పడం గమనార్హం.

- మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, ఆంధ్రజ్యోతి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖలో నిబంధలను ఉల్లంఘించి, జీవోలను పక్కన పెట్టి, ఉన్నతాఽధికారుల ఆదేశాలు లేకుండా ఉపాధ్యాయులకు ఇష్టం వచ్చినట్లు డిప్యుటేషన్లు ఇచ్చారు. మొన్నటి వరకు ఇన్‌చార్జి డీఈవోగా పని చేసిన రవీందర్‌ ఒక్కో ప్లేస్‌కు ఒక్కో రేట్‌ తీసుకుని, డిప్యుటేషన్‌ ఇచ్చినట్లు ఆరోణలు వస్తున్నాయి. విద్యార్థుల అవసరం మేరకు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంటే, అక్కడ ఏ సబ్జెక్టు టీచర్‌ అవసరం ఉంది?, ఎవరిని పంపించాలి? అని జిల్లా బాస్‌ అనుమతి తీసుకుని సర్దుబాటు చేయాలి. కానీ మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా, ఉపాధ్యాయుల సౌకర్యం కోసం డిప్యుటేషన్లు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 193 మంది డిప్యుటేషన్‌పై పని చేస్తున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎవరికీ డిప్యుటేషన్‌ ఇస్తున్నట్లు ఆదేశాలు లేవు. మౌకిక ఆదేశాల ప్రకారమే కొనసాగుతున్నారు.

ఎంఈవో వద్దకు పంచాయితీ..

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండల పరిధిలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడి అక్కడికి డిప్యుటేషన్‌పై వచ్చారు. ఆ పాఠశాలలో అవసం లేకున్నా ఇన్‌చార్జి డీఈవో మౌకిక ఆదేశాలతో ఆయన్ను చేర్చుకున్నారు. ఇన్‌చార్జి డీఈవో ఏసీబీకి పట్టుబడటంతో డిప్యుటేషన్‌పై వచ్చిన సదరు ఉపాధ్యాయుడిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సొంత స్కూల్‌కు వెళ్లాలని చెప్పారు. ఈ పంచాయితీ కాస్త మండల విద్శాశాఖ అధికారి వద్దకు చేరింది. ఎంఈవో కూడా డిప్యుటేషన్‌ పొందిన ఉపాధ్యాయుడిని సొంత పాఠశాలలోనే పని చేయాలని ఆదేశించారు. ఈ డిప్యుటేషన్‌పై పలువురు ఎంఈవోలను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా తాము బాధ్యతలు తీసుకోకముందే డిప్యుటేషన్‌ ఇచ్చారని తెలిపారు. దీనిపై డీఈవో కార్యలయ ఏడీ అనసూయను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌ ద్వారా వివరణ కోరగా డిప్యుటేషన్లకు సంబంధించి తమ దగ్గర ఎలాంటి సమాచం లేదని తెలిపారు.

డబ్బులు తీసుకుని..

మండల స్థాయిలో స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రఽధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమావేశమై, ఎక్కడైనా విద్యార్థుల సంఖ్యకు ఉపాధ్యాయులు తక్కువగా ఉంటే.. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోట నుంచి సర్దుబాటు చేసుకోవచ్చని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. అందుకు కలెక్టర్‌ అనుమ తీసుకోవాలని చెప్పారు. కాని జిల్లాలో మాత్రం స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధి దాటి ఉపాధ్యాయులకు డిప్యుటేషన్‌ ఇచ్చారు. తద్వారా ఇన్‌చార్జి డీఈవోకు కాసుల పంట పండిందని ఆరోపణలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలంలో జడ్చర్ల, మిడ్జిల్‌ మండలాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు డిప్యుటేషన్‌ ఇచ్చారు. అందుకు ఇన్‌చార్జి డీఈవోకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెప్పినట్లు సమాచారం.

అక్రమ డిప్యుటేషన్స్‌ మచ్చుకు కొన్ని..

గండీడ్‌ మండల పరిధిలోని పగిడ్యాల్‌ తండాలో పనిచేస్తున్న ఓ టీచర్‌కు హన్వాడ మండల కేంద్రంలోని ప్రాఽథమిక పాఠశాలకు డిప్యుటేషన్‌ ఇచ్చారు.

జడ్చర్ల మండల పరిధిలోని ఎంపీపీఎస్‌ చంద్రు తండాలో పనిచేసే ఉపాధ్యాయుడిని మహబూబ్‌నగర్‌ మండల పరిధిలోని ఎంపీపీఎస్‌ అంబటిపల్లికి డిప్యుటేషన్‌ ఇచ్చారు.

జడ్చర్ల మండల పరిధిలోని ఎంపీపీఎస్‌ వల్లుర్‌లో పని చేసే ఉపాధ్యాయుడిని మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండల పరిధిలోని ఎంపీపీఎస్‌ ఎర్రవల్లి తండాకు డిప్యుటేషన్‌ ఇచ్చారు.

హన్వాడ మండలంలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులకు మహబూబ్‌నగర్‌ మండలలోని పాఠశాలకు డిప్యుటేషన్‌ ఇచ్చారు.

మహబూబ్‌నగర్‌ మండలంలో కూడా 13 మందికి డిప్యుటేషన్లు ఇచ్చినట్లు ఎంఈవో లక్ష్మణ్‌సింగ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Nov 11 , 2024 | 11:24 PM