పెరుగుతున్న షుగర్ వ్యాధిగ్రస్తులు
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:39 PM
జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యంగా వస్తున్న షుగర్ వ్యాధి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌సీడీ సర్వే ద్వారా జిల్లాలో 30 ఏళ్లకు పైబడిన వివరాలు చూస్తే 46,648 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 46,648 మంది బాధితులు
పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా నమోదు
నేడు ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యంగా వస్తున్న షుగర్ వ్యాధి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌సీడీ సర్వే ద్వారా జిల్లాలో 30 ఏళ్లకు పైబడిన వివరాలు చూస్తే 46,648 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో అధికారికంగా మందులు వాడుతున్న వారు 16,525 మంది ఉన్నా రు. మిగతా వారు ప్రైవేటులో మందులు వాడుతున్నారు. బాధితులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం జిల్లాలోని 25 పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో అత్యధికంగా మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాలలో బీపీ, షుగర్ బాధితులు ఉన్నారు. ప్రభుత్వం ఎన్‌సీడీ క్లీనిక్‌ల ద్వారా వారికి వైద్య సేవలు అందిస్తోంది.
ఏడాదిలో 9,402 మందికి..
జిల్లాలో షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరుగుతున్నారు. గత ఏడాది 38,246 మంది బాధితులు ఉంటే, ఈ ఏడాది మరో 9,402 మంది పెరిగారు. వంశపారంపర్యంగా, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇది సోకుతుంది.
ఎన్‌సీడీ క్లీనిక్‌ల ద్వారా వైద్య సేవలు
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య సిబ్బంది గతంలో 104 వాహనాల్లో గ్రామాలకు వచ్చి మందులు ఇచ్చే వారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిలిపేయడంతో ఎన్‌సీడీ క్లీనిక్‌లను అందుబాటులోకి తెచ్చారు. జనరల్ ఆస్పత్రి, జడ్చర్లలోని కమ్యూనిటీ ఆస్పత్రి, కోయిలకొండ కమ్యూనిటీ ఆస్పత్రిలో ఈ క్లీనిక్‌లను ఏర్పాటు చేశారు. అక్కడే పరీక్షలు చేసి, మందులు ఇస్తున్నారు. ఇదివరకు గుర్తించిన ప్రకారం ఈ క్లీనిక్‌ల ద్వారా 16,525 మంది మందులు వాడుతున్నారు.
వనపర్తిలో ప్రత్యేక కార్యక్రమం
వనపర్తి(ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లాలో 20387 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్నారు. కలెక్టర్ చొరవతో జిల్లాలోని ఐదు పీహెచ్‌సీలో పరిధిలో ఈ నెల ఒకటి నుంచి ఇంటింటికి 30 ఏళ్లు పైబడిన వారు 14,698 మందికి పరీక్షలు చేశారు. 688 మందికి షుగర్ లెవల్స్ ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. రక్తం సేకరించి, పరీక్షలకు పంపించారు.