Share News

చివరి ఆయకట్టుకు సాగునీరు

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:40 PM

చివరి ఆయకట్టు వరకు ప్రతీ ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

చివరి ఆయకట్టుకు సాగునీరు
నీటి విడుదలకు ముందు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి

- సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : చివరి ఆయకట్టు వరకు ప్రతీ ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని సంగాల రిజర్వాయర్‌ నుంచి సంగాల చెరువుకు, చెరువు నుంచి ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సంగాల చెరువు నుంచి వరుసగా ఆరేళ్లుగా సాగునీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని వివరించారు. ఇప్పటికే రూ.2లక్షల రుణమాఫీ చేసిందని, సంక్రాంతి నుంచి పంట పెట్టుబడి కోసం రైతుభరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ. 7,500ల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడంతో పాటు సన్నాలకు క్వింటాలుకు రూ.500లు బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు. ఎకరాలో పండించిన ధాన్యం విక్రయిస్తే రైతుకు రూ.12,500 వరకు బోనస్‌ వస్తుందని వివరించారు. ఇది రైతు బంధు కంటే మెరుగైన పథకం అని ఏ రాష్ట్రంలో కూడా ధాన్యానికి బోనస్‌ ఇవ్వడం లేదని అన్నారు. సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. చివరి ఆయకట్టు రైతు కూడా పంటను పండించుకోవాలని, వారి పంటలకు సాగునీరు అందించేందుకు అందరూ బాధ్యతగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ సుభాన్‌, మార్కెట్‌ చైర్మన్‌ కుర్వ హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ప్రతాప్‌ గౌడ్‌, రమేష్‌ నాయుడు, రాధాకృష్ణారెడ్డి, మురళీ, బాబర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:40 PM