ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదాం
ABN , Publish Date - Nov 23 , 2024 | 11:05 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై సంఘటిత పోరాటాలు సాగిద్ధామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు కోరారు.
- ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు
గద్వాల టౌన్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై సంఘటిత పోరాటాలు సాగిద్ధామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు కోరారు. సంయుక్త కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 26న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలన్నారు. ఆందోళన పోస్టర్‌ను శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద విడుదల చేసి, మాట్లాడారు. కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించున్న హక్కులను కాలరాసిన కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించడం వల్ల కార్మికులకు తీరని ద్రోహం జరిగిందన్నారు. దేశంలోని వ్యవసాయమంతా కార్పొరేట్ పరం చేసే కుట్రతో రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను రైతు సంఘాల ప్రతినిధులతో విరమిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, ఇప్పటికీ అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ క్రమంలో సంయుక్త కిసాన్‌మోర్చా చేపట్టిన దశలవారీ ఆందోళనలో జిల్లాకు చెందిన రైతులు, కార్మికులు పాల్గొనాలని కోరారు. తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నరసింహ, ఏఐటీయూసీ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కృష్ణ, ఆశన్న, తిమ్మప్ప, నరేంద్ర, ఉప్పేరు నరసింహ ఉన్నారు.
కరపత్రం విడుదల
ఉండవల్లి : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ శనివారం వ్యవసాయ రైతు సంఘం జిల్లా నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలకు నిరసనగా ఈనెల 26న జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర, శ్రీనివాసులు, రాంబాబు, రాజు పాల్గొన్నారు.