Share News

మహిళపై వ్యక్తి దాడి

ABN , Publish Date - Dec 07 , 2024 | 11:22 PM

మహిళపై కత్తితో దాడి చేసి, నగలు అపహరించేందుకు వ్యక్తి యత్నించిన సంఘటన నవాబ్‌పేట మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి వివరాల ప్రకారం...

మహిళపై వ్యక్తి దాడి

కత్తితో బెదిరించి ఆభరణాలు అపహరించేందుకు యత్నం

గొంతుపై తీవ్ర గాయం

నవాబ్‌పేట, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మహిళపై కత్తితో దాడి చేసి, నగలు అపహరించేందుకు వ్యక్తి యత్నించిన సంఘటన నవాబ్‌పేట మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి వివరాల ప్రకారం... మండలంలోని పల్లెగడ్డ గ్రామానికి చెందిన అంకమ్మ శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గ్రామం నుంచి జడ్చర్ల మండలం ఉదండాపూర్‌ గ్రామానికి బంధువుల వద్దకు వెళ్లేందుకు బయల్దేరింది. మార్గం మధ్యలో నవాబ్‌పేటలోని కల్లు దుకాణంలో కల్లు తాగి వెళ్తుండగా, అక్కడే ఉన్న మండలంలోని కూచూర్‌ గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి ఆమెను చూశాడు. తాను మహబూబ్‌నగర్‌ వెళ్తున్నానని తీగలపల్లి గేట్‌ వద్ద దించుతానని అంకమ్మను బైక్‌పై ఎక్కించుకున్నాడు. తీగలపల్లి గేట్‌ వద్ద ఆమెను దించకుండా, మైసమ్మ అడవిలోకి తీసుకెళ్లాడు. తర్వాత ఆమెపై దాడి చేసి, కత్తితో బెదిరించాడు. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కుంటుండగా పెనుగులాటలో అంకమ్మ గొంతుకు తీవ్ర గాయమైంది. రక్తం కారుతుండటంతో ఆమె కేకలు వేసింది. ఆ అరుపులు విన్న రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. తర్వాత మహిళ రోడ్డుపైకి వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. కరుణా కర్‌రెడ్డి కూడా వచ్చి, కిందపడ్డాడు. అతని తలకు గాయం ఉన్నది. అంకమ్మను అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. కరుణాకర్‌రెడ్డిని పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తల్లి వచ్చి ఆస్పత్రిలో చూపిస్తానని అతన్ని తీసుకెళ్లిందని తెలిసింది. కరుణాకర్‌ గతంలో మహిళలను హత్యచేసి, ఒంటిపై ఉన్న ఆభరణాలు దొంగిలించాడని, పలుమార్లు జైలు శిక్ష అనుభవించినట్లు తెలిసింది. 108 సిబ్బంది ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 07 , 2024 | 11:22 PM