Share News

మోదుగుంటను పూడ్చేశారు

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:22 PM

హైడ్రా అంటేనే హడల్‌... అది కాస్త పాలమూరులోని సర్వే నెంబర్‌ 523కి రాగానే ప్రతీ ఒక్కరిలో ఏదో ఆందోళన. రియల్టర్లు, ప్లాట్ల అమ్మకందారులు చేసిన తప్పిదాల వల్ల ఆపద ఎవరి ఇంటికి ఎలా వస్తుందోననే ఆందోళన... చెరువులు, కుంటలు, కాల్వల సమీపంలో లక్షలు వెచ్చించి కొన్న ప్లాట్లు, ఇళ్ల యజమానుల్లో భయం భయం... కానీ, ఇక్కడ మాత్రం జాన్తానై.. హైడ్రాలు ఉన్నా, ఫిర్యాదులు చేస్తున్నా, అధికారులు తనిఖీల పేర తతంగం నడిపిస్తున్నా యథేచ్ఛగా ఆక్రమణ జరుగుతోంది...

మోదుగుంటను పూడ్చేశారు
మోదుగుంట చెరువును పూడ్చుకుంటూ వేస్తున్న రోడ్డు

హైడ్రా భయం కలిగిస్తున్నా ఆగని ఆక్రమణలు

రూ. 20 కోట్ల విలువైన శిఖం, ఎఫ్‌టీఎల్‌ భూములు దర్జాగా కబ్జా

మోదుగుంట చెరువును పూడ్చివేసి రోడ్డు నిర్మాణం

నిషేధిత జాబితాలోని భూమిలో సూపర్‌ మార్కెట్‌?

కోర్టు ఆర్డర్‌ ఉన్నా విచారణకు గైర్హాజరవుతున్న పరిస్థితి

చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం

సర్వే నెంబర్‌ 292 గుట్టు తేలితే ప్రభుత్వ భూమికి రక్షణ

హైడ్రా అంటేనే హడల్‌... అది కాస్త పాలమూరులోని సర్వే నెంబర్‌ 523కి రాగానే ప్రతీ ఒక్కరిలో ఏదో ఆందోళన. రియల్టర్లు, ప్లాట్ల అమ్మకందారులు చేసిన తప్పిదాల వల్ల ఆపద ఎవరి ఇంటికి ఎలా వస్తుందోననే ఆందోళన... చెరువులు, కుంటలు, కాల్వల సమీపంలో లక్షలు వెచ్చించి కొన్న ప్లాట్లు, ఇళ్ల యజమానుల్లో భయం భయం... కానీ, ఇక్కడ మాత్రం జాన్తానై.. హైడ్రాలు ఉన్నా, ఫిర్యాదులు చేస్తున్నా, అధికారులు తనిఖీల పేర తతంగం నడిపిస్తున్నా యథేచ్ఛగా ఆక్రమణ జరుగుతోంది... అది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. పాలమూరు ప్రధాన రహదారి పక్కనే కావడం ఆశ్చర్యం.. అటు నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులు వెళుతున్నా ఇదంతా ఎవరి కూడా తెలియదంటే నమ్మాల్సిందే.. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చెర నుంచి రక్షించాలని ప్రయత్నిస్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది.. ఈ పరిస్థితుల్లో ఏనుగొండలోని మోదుగుంటను రక్షించేరా, ఆక్రమణదారులకు అప్పగించేరా...

మహబూబ్‌నగర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఓ వైపు రాజధానిలో హైడ్రా పేరుతో చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా మరోవైపు మహబూబ్‌నగర్‌ పట్టణంలోని సర్వే నెంబర్‌ 523లో అక్రమ నిర్మాణాల పేర కొన్నింటిని తొలగించిన విషయం తెలిసిందే. ఆ భయం ఉంటే కబ్జాదారులు ప్రభుత్వ, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ భూముల్లో నిర్మాణాలు కానీ, కబ్జాలు కానీ ఎవరూ చేయబోరని ప్రభుత్వం, అధికార యంత్రాంగం భావన. అయినా మహబూబ్‌నగర్‌ నడిబొడ్డున ఆక్రమణల పర్వం ఆగడం లేదు. గతంలోనే ప్రభుత్వ భూములు, ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి వాటి ద్వారా లబ్ధి పొందుతుండగా తాజాగా మరో అడుగు ముందుకేసి కబ్జా పరిధిని విస్తృతం చేస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొన్నది. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులంతా వెళ్లే దారిలోనే ఈ కబ్జాల పర్వం నడుస్తున్నా, అది ఆక్రమణ అని తెలుస్తున్నా ఇప్పటివరకు నిర్దిష్టంగా చర్యలు తీసుకోవడం లేదు. మరి వారికి అధికారులు మద్దతు ఇస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.

చెరువును చెరబట్టారు..

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం ఎనుగొండ శివారులోని 292 సర్వే నెంబర్‌లో 7.29 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇది మొత్తం మోదుగుంట చెరువు భూమి. పక్కన ఇదే సర్వే నెంబర్‌లో దాదాపు 5.22 ఎకరాలు పట్టా భూమి కూడా ఉన్నది. అది కూడా ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నది. నీరు బాగా వస్తే ఈ భూములన్నీ ముంపునకు గురవుతాయి. అయితే ఈ చెరువు భూమిలో కొంతభాగం మౌలాలి గుట్ట డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు వెళ్లేందుకు మట్టి పోసి కచ్చా రోడ్డు వేయగా ఆ పక్కనే ఉన్న పంక్షన్‌ హాల్‌, సూపర్‌ మార్కెట్‌లలో కొంత భాగం ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే 292 సర్వే నెంబర్‌లోకే సూపర్‌ మార్కెట్‌ మెజారిటీ స్థలం వస్తుందని ధరణి కెడస్ట్రల్‌ మ్యాప్‌ల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. 291 సర్వే నెంబర్‌లో పట్టా కలిగి ఉన్న సదరు పంక్షన్‌ హాల్‌ నిర్వాహకులు తాజాగా వారి హద్దును దాటి 292 సర్వే నెంబర్‌లోని చెరువును పూడుస్తూ మళ్లీ రోడ్డును నిర్మిస్తున్నారు. మొదటి నుంచి రోడ్డు కోసమని మట్టిని పోయడం, తర్వాత హద్దులు మార్చడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని ఎనుగొండ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు వెళ్లి విచారణ కూడా నిర్వహించారు. అక్కడ 292 సర్వే నెంబర్‌ మొత్తం ప్రభుత్వ భూమేనని, అందులో కొంతమేర నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే దానికోసం ఇరిగేషన్‌, రెవెన్యూ, మునిసిపల్‌ శాఖ ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహించాల్సి ఉంది. కానీ, మునిసిపల్‌ అధికారులు ఈ ఆక్రమణలపై చర్యలకు ఉపక్రమించడం లేదు. దాదాపు ఎకరం స్థలం వరకు ప్రభుత్వ భూమి ఇక్కడ కబ్జా అయ్యిందని ఆరోపణలు ఉండగా దాని విలువ రూ. 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొదట చెరువు ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించడం, ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన సమయంలోనే అధికారులు చర్యలు తీసుకోకపోవడం, కొంతమంది అధికారులకు డబ్బులు ముట్టజెప్పి పనులు చేసుకోవడంతో తాజాగా ఇంత భయాందోళనలోనూ కబ్జా చేయడానికి సదరు వ్యక్తులు సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోర్టు ఆదేశాలు బేఖాతరు..

ఈ సర్వే నెంబర్‌లోని భూములన్నీ ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇప్పుడున్న ఫంక్షన్‌హాల్‌, సూపర్‌ మార్కెట్‌ కూడా చెరువుకు అతిసమీపంలో ఉన్నాయి. మౌలాలి గుట్టకు వెళ్లే మట్టి రోడ్డు వేయకపోతే దాదాపు ఆ రెండు నిర్మాణాలు చెరువుకు ఆనుకొని ఉండేవి. అయితే ఇక్కడ ఎఫ్‌టీఎల్‌ పరిధిని గుర్తిస్తే అవి కూడా అందులోకి వస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆక్రమణలపై ఇమ్మడి పురుషోత్తంరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై గత సంవత్సరం ఆగష్టు 28వ తేదీన కోర్టు ఆర్డర్‌ ఇచ్చింది. మునిసిపల్‌ అధికారులు పిటిషనర్‌, రెస్పాండెంట్‌ పార్టీలకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు విన్న తర్వాత అవసరమైన మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ తర్వాత అక్టోబరు నెల 31వ తేదీన విచారణకు ఇరు పార్టీలను పిలువగా పిటిషనర్‌ హాజరుకాగా రెస్పాండెంట్‌ అది కబ్జా కాదు అని నిరూపించుకోవడానికి సరైన ధ్రువపత్రాలు సమర్పించడానికి సమయం కోరారు. తర్వాత నవంబర్‌ 15వ తేదీకి వాయిదా వేయగా అప్పుడు కూడా పిటిషనర్‌ ఒక్కరే హాజరయ్యారు. కానీ, ఇప్పటివరకు ఆ కోర్టు ఆర్డర్‌ ప్రకారం చర్యలు మాత్రం మునిసిపల్‌ అధికారులు తీసుకోలేదు. కమిషనర్‌ మారడం, ప్రభుత్వం మారడం అన్నీ జరిగిపోయాయి కానీ, ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా పరిస్థితి ఉన్నది. ఫిర్యాదులు చేయడం వల్ల కబ్జాదారులను బెదిరించి అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారే కానీ ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో శ్రద్ధలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఆ సర్వే నెంబర్‌ మొత్తం ప్రభుత్వ భూమే

- నర్సింగ్‌, ఆర్‌ఐ, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం

ఎనుగొండ శివారులోని సర్వే నెంబర్‌ 291 మొత్తం ప్రభుత్వ భూమే. ఇందులో చెరువు ఉన్నది. ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఇటీవల పరిశీలన చేశాము. కొలతలు చేస్తే ఎంతవరకు వస్తుందనేది తేలుతుంది. పంక్షన్‌ హాల్‌ అందులోకి వస్తుందా లేదా అనేది మరోసారి వెళ్లి కొలతలు చేసిన తర్వాత నిర్ణయిస్తాం. ఇరిగేషన్‌, మునిసిపల్‌, రెవెన్యూ ఆధ్వర్యంలో జరిగితే హద్దులు సరిగా నిర్ణయించవచ్చు.

మట్టి రోడ్డు నిర్మాణాన్ని ఆపాం

- మనోహర్‌, డీఈ, ఇరిగేషన్‌ శాఖ

జేజేఆర్‌ పంక్షన్‌ హాల్‌ వెనుక మట్టి పోస్తున్నారని మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు వ చ్చింది. ఆ ఫిర్యాదు మేరకు సంయుక్తంగా వెళ్లి విచారణ నిర్వహించాం. మట్టి పోసి రోడ్డు వే యడాన్ని నిలిపివేశాం. ఇందులో ఎఫ్‌టీఎల్‌ ఎం తవరకు వస్తుందనేది కొలతలు చేయాలి. విలే జీ సర్వే మ్యాపు ప్రకారం చూసి కొలత చేస్తేనే ఎంత ప్రభుత్వ భూమి ఉందో తేలుతుంది.

Updated Date - Nov 14 , 2024 | 11:22 PM