ముడా నిధులుపారదర్శకంగా వాడాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:02 PM
మహబూబ్‌నగర్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(ముడా) నిధులను అత్యంత పారదర్శకంగా వినియోగించాలని జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. ఆ నిధులను అనవసరమైన పనుల కోసం వెచ్చించరాదని స్పష్టం చేశారు.
హైమాస్ట్ లైట్లు.. పాఠశాలలు.. సీసీ రోడ్లకు ప్రాధాన్యం
హరితహారానికి వినియోగించొద్దు
పూర్తిస్థాయి ప్రతిపాదనలతో జనవరి 4న సమావేశం
పాలకమండలి మొదటి సమావేశంలో పాల్గొన్న నలుగురు ఎమ్మెల్యేలు
మహబూబ్‌నగర్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(ముడా) నిధులను అత్యంత పారదర్శకంగా వినియోగించాలని జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. ఆ నిధులను అనవసరమైన పనుల కోసం వెచ్చించరాదని స్పష్టం చేశారు. గతంలో రూ.3.5 కోట్లు హరితహారం పేరిట దుబారా చేశారని, ప్రస్తుతం ఈ నిధులను హరితహారం, మొక్కలు నాటేందుకు వినియోగించొద్దని అభిప్రాయపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని ముడా కార్యాలయంలో చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ అధ్యక్షతన పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముడా పరిధిలోని మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల, పరిగి ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డితోపాటు మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి పాల్గొన్నారు. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయకపోవడంతో జనవరి నాల్గో తేదీన పూర్తి స్థాయి ప్రతిపాదనలతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే ఈ నిధులతో హైమాస్ట్ లైట్లు, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, సీసీరోడ్లు వంటి పనులు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి జిల్లావాసి కావడంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉందన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, జిల్లాకు మంచి పేరు తెచ్చేలా పనితీరును మార్చుకోవాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు, చైర్మన్‌లు దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు.