Share News

న్యాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ లక్ష్యం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:35 PM

‘పాలమూరు యూనివర్సిటీకి న్యాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ సాధించడమే లక్ష్యంగా పని చేస్తా. ఇక్కడ తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయం అన్ని వసతులు ఉన్నాయి. విద్యార్థులు చాలా మంది భవిష్యత్‌ మీద దృష్టితో గ్రంథాలయంలో ఎక్కువ సేపు ఉంటున్నారు. ఉపాధి అందించే కోర్సులను పెంచి, విద్యార్థులకు సంస్కారం నేర్పి సమాజానికి అందిస్తాం.

న్యాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ లక్ష్యం
పీయూ వీసీ శ్రీనివాస్‌

ఉపాధి కల్పన కోర్సులకు మొదటి ప్రాధాన్యం

పీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌

‘పాలమూరు యూనివర్సిటీకి న్యాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ సాధించడమే లక్ష్యంగా పని చేస్తా. ఇక్కడ తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయం అన్ని వసతులు ఉన్నాయి. విద్యార్థులు చాలా మంది భవిష్యత్‌ మీద దృష్టితో గ్రంథాలయంలో ఎక్కువ సేపు ఉంటున్నారు. ఉపాధి అందించే కోర్సులను పెంచి, విద్యార్థులకు సంస్కారం నేర్పి సమాజానికి అందిస్తాం. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పని చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. వర్సిటీ అనుబంధ పీజీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పిస్తాం. ఈ సారి ఎక్కువ నిధులు వస్తాయని ఆశిస్తున్నాం’ అని అంటున్నారు పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

పాలమూరు యూనివర్సిటీ, (ఆంధ్రజ్యోతి)

పీయూ వీసీగా వచ్చిన మొదటి రోజు ఎలా అనిపించింది?

నేను బాధ్యతలు చేపట్టాక తరగతి గదులు, ల్యాబ్‌, హాస్టల్స్‌, లైబ్రరీ, ఫార్మసీ కళాశాలను పరిశీలించాను. ఇక్క డ అన్ని వసతులూ ఉన్నాయి. సైన్స్‌ విభాగాల ల్యాబ్‌, క్లాసులు అన్నీ బాగున్నాయి. రెగ్యులర్‌ అధ్యాపకుల కంటే కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఎక్కువగా ఉన్నారు. కానీ అందరు ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. విద్యార్థులు కూడా తరగతులకు బాగా హాజరవుతున్నారు. విద్యార్థులను ఎక్కువగా లైబ్రరీలో చుశాను. కెరియర్‌పై ఎక్కువగా దృష్టితో ముందుకు వెళ్లడం మంచి విషయం.

వీసీగా వర్సిటీ అభివృద్ధికి ఏమేం లక్ష్యాలు నిర్ధేశించుకున్నారు?

వర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను పెంచుతాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేసి, స్థిరపడేలా చూస్తాం. చదువుతో పాటు సంస్కారం, పద్ధతులు నేర్పుతాం. ఓవరాల్‌గా ఇంగ్లీష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మెంటల్‌ ఎబిలిటీ, లిడర్‌షిప్‌ క్వాలిటీస్‌, ఆర్గనైజేషన్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి, సొసైటీకి ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం.

నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు చాలా కాలంగా తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్నారు. వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగ భద్రత లేదు. వారి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందా?

వర్సిటీలో పని చేస్తున్న అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌ రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పని చేస్తున్న వారి వివరాలను తీసుకుంటాం. వారి ఫైల్‌ పరిశీలించి, నా స్థాయిలో జరిగేవి ఉంటే వెంటనే పరిష్కరిస్తా. మిగతావి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.

కొత్త పీజీ సెంటర్లను ఏర్పాటు చేస్తారా?

వర్సిటీకి అనుబంధంగా వనపర్తి, జోగుళాంబ గద్వాల, కొల్లాపూర్‌లలో పీజీ సెంటర్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. కొత్తగా పీజీ సెంటర్లను ఏర్పాటు చేయము. కానీ ప్రస్తుతం ఉన్న సెంటర్లలో విద్యా ప్రమాణాలను పెంచుతాం. విద్యార్థులకు హాస్టల్‌ వసతి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. వాటిని మరింత అభివద్ధి చేస్తాం.

నిధుల కొరతను ఎలా అధిగమిస్తారు?

పాలమూరు యూనివర్సిటీకి నిధులు తక్కుగా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఇప్పటి వరకు వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలు తెలుసుకుంటా. ఈ సారి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తాయని ఆశిస్తున్నా.

Updated Date - Oct 22 , 2024 | 11:35 PM