Share News

నేడు ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ పరీక్ష

ABN , Publish Date - Nov 23 , 2024 | 10:41 PM

గ్రామీణ ప్రాంతాలలో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీ కుటుంబాలు కోకొల్లలుగా ఉంటాయి.

నేడు ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ పరీక్ష
ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ పరీక్ష కోసం చదువుతున్న చింతలకుంట పాఠశాల విద్యార్థులు

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాయనున్న 2,950 మంది విద్యార్థులు

- పరీక్షలో ఎంపికైతే నాలుగేళ్లకు ఏటా రూ. 12 వేల స్కాలర్‌షిప్‌ మంజూరు

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3188 పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న వారు 26,794 మంది

- ప్రభుత్వ పాఠశాలల్లో స్కాలర్‌షిప్‌ టెస్ట్‌పై అవగాహన పెరగాలంటున్న విద్యాభిమానులు

అయిజటౌన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాలలో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీ కుటుంబాలు కోకొల్లలుగా ఉంటాయి. అటువంటి కుటంబాలలో ప్రాథమిక విద్య అనంతరం పై చుదువులు చదివించాలంటే చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి ఆడపిల్ల్లను ప్రాథమిక విద్య అనంతరం బడులు మాన్పించటం గ్రామాల్లో పరిపాటిగా మారింది. ఈ పరిస్థితులన్నింటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌) పథకాన్ని ప్రవేశపెట్టింది. దానిద్వారా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ను రాసేందుకు నింబంధనలు ఉన్నాయి. ఇప్పటికే 2024-25లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 8వ తరగతి చదివే బాలబాలికలు 2,950 మంది దరఖాస్తు చేసుకుని నేడు ఆయా జిల్లా కేంద్రాలలో పరీక్షలు రాయనునున్నారు.

స్కాలర్‌షిప్‌ ఎంత వస్తుంది..

8వ, తరగతి చదివే విద్యార్థులు పరీక్ష రాసి ఎంపికైతే వారికి 9, 10, 11, 12 తరగతుల వరకు సంవత్సరంలో 10 నెలలు (నెలకు రూ, 1200 లాగా) ఏడాదికి రూ, 12000 నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయి. ఈ విధంగా నాలుగేళ్లకు పుస్తకాలు, వారికి కావలసిన విద్యాపరమైన అవసరాలు తీర్చుకునేందుకు గానూ 48వేల రూపాయలు విద్యార్థికే నేరుగా అంది వారి చదువు ఎటువంటి అటంకం లేకుండా కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. పరీక్ష విధానం కూడా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు రెండు విభాగాలుగా 180 ప్రశ్నలతో ఉంటుంది. మొదటి విభాగంలో 90 మార్కులకు గానూ మెంటల్‌ ఎబిలిటీ, కోడింగ్‌, ఢీకోడింగ్‌, లాజికల్‌, అల్పాబెట్‌, రీజనింగ్‌, సంఖ్యాశాస్త్రం, వెన్‌ చిత్రాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగంలోని 90 మార్కులకు గానూ 7, 8వ, తరగతుల సిలబస్‌ నుంచి గణితం, భౌతిక, రసాయన, జీవశాస్ర్తాల పాఠ్యాంశాల నుంచి అబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండింటికి గాను 110 మార్కులు సాధిస్తే వారు స్కాలర్‌షిప్‌కు ఎంపిక అవుతారు.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా....

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 3188 ఉండగా అందులో 8వ తరగతి విద్యనభ్యసించే విద్యార్థులు 26,794 మంది ఉన్నారు. ఇందులో కేవలం 2,950 మంది విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌కు దరాఖాస్తు చేసుకోవటం చూస్తే ఈ పరీక్షపై ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ఈ పరీక్షలపై అవగాహన కల్పించి వారి పైచదువులకు ఆర్థిక భరోసా ఉండేలా తోడ్పాటు అందించాలని పలువురు కోరుతున్నారు.

పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశాం

- శ్రీనివాసులు, పరీక్షల విభాగం అధికారి, గద్వాల

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగే స్కాలర్‌షిప్‌ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గద్వాల జిల్లాలో మొత్తం 65 పాఠశాలల నుంచి 785 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వ అభ్యసన, ప్రభుత్వ బాలుర, బాలిక, బ్రిలియంట్‌ పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేయటం జరిగింది. 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్‌ లాగా 39 మందిని నియమించి, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ను కూడా కేటాయించాం. పరీక్ష ఉదయం 9:30 ప్రారంభమయ్యే దానికంటే గంట ముందుగా విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకోవాలి.

Updated Date - Nov 23 , 2024 | 10:41 PM