Share News

అన్నదాతల పడిగాపులు

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:31 PM

జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.

అన్నదాతల పడిగాపులు
గోపాల్‌పేట కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని ఆరబోసిన రైతులు

  • ధాన్యం సేకరణలో ఆలస్యం

  • ఆందోళన చెందుతున్న రైతులు

  • జిల్లా వ్యాప్తంగా 379 కేంద్రాలకు ప్రారంభించింది 183 కేంద్రాలే

  • కేంద్రాల వద్ద నిలిచిన ధాన్యం

  • నూర్పిడి, మాల్‌ వెయింగ్‌ మిషన్‌ల కొరతతో ఆలస్యమవుతోందని ఆరోపణలు

  • త్వరగా కొనుగోలు చేయాలని వేడుకుంటున్న అన్నదాతలు

వనపర్తి అర్బన్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. 15 రోజుల నుంచి వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో కొను గోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. కానీ ఆ స్థాయి లో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. జిల్లా వ్యాప్తంగా 379 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటి వరకు 183 మాత్రమే ప్రారంభించారు. ఈ సీజన్‌ లో సుమారు నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులు కూడా వరి కోతలు ప్రా రంభించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తు న్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యం అవుతుండడంతో కొ నుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కాపాడుకో వడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు.

కేంద్రాల వద్దే పడిగాపులు

జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు అవుతున్నా కొన్ని ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో రైతులు ప్రతీరోజు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కా స్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే గానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేమని సమాధానం ఇస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. రోజు రోజుకు ఆలస్యం కావడం వలన వర్షం కురిస్తే ఆరుగాలం చేసిన కష్టం నీటి పాల వుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకు గ్యారెంటీనే ప్రధాన సమస్య..!

జిల్లా వ్యాప్తంగా మొత్తం 173 రైస్‌ మిల్లులు ఉండగా అందులో 12 బాయిల్డ్‌ మిల్లులు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు డిఫాల్టర్‌ అయినవి 120 ఉన్నాయి. మిగతా మిల్లులకు ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. వీరందరూ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వగానే ధాన్యం కేటాయిం చనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి సమాచారం. ఇప్పటి వరకు జిల్లాలో బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడానికి ఒక్క మిల్లర్‌ కూడా ముందుకు రాలేదు. దీంతో ధాన్యం సేకరణతో పాటు కేంద్రాలను ప్రారంభిం చడం ఆలస్యమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 57వేల మంది రైతుల నుంచి 469 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు సమాచారం.

Updated Date - Nov 11 , 2024 | 11:31 PM