భవితకు బాటలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:32 PM
విజ్ఞాన భాండాగారాలు, ఆధునిక దేవాలయాలు అయిన గ్రంథాలయాలు యువత భవితకు బాటలు వేస్తున్నాయి.
- గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
- పాఠకులకు అందుబాటులో వేలాది పుస్తకాలు
- పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన మెటీరియల్
- గురువారం నుంచి ప్రారంభమైన వారోత్సవాలు
విజ్ఞాన భాండాగారాలు, ఆధునిక దేవాలయాలు అయిన గ్రంథాలయాలు యువత భవితకు బాటలు వేస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగార్థులు, సాహితీప్రియులతో పాటు సాధారణ పాఠకులకు అవసరమైన అన్ని పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉంటున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వసతులనూ సంతరించుకుంటున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అవసరమైన పుస్తకాలనూ అందిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు రోజంతా అక్కడే ఉండి పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్ర గ్రంథాలయాలను ‘ఆంధ్రజ్యోతి’ గురువారం విజిట్ చేసింది. అక్కడి వసతులు, సమస్యలను తెలుసుకున్నది. ఆ వివరాలు మీ కోసం...
- మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నారాయణపేట,
గద్వాల టౌన్, వనపర్తి రాజీవ్ చౌరస్తా, నాగర్‌కర్నూల్ టౌన్
పాఠకులతో కళకళ
- మహబూబ్‌నగర్ శాఖా గ్రంథాలయంలో ఆధునిక వసతులు
- అందుబాటులో 55 వేల పుస్తకాలు
మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు, రాంనగర్ చౌరస్తా లోని గ్రంథాలయం నిత్యం పాఠకులతో కళకళ లాడుతున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, సాహితీప్రియులు, పఠనాసక్తి ఉన్న వారు ప్రతీ రోజూ మూడు వందల మందికి పైగా పాఠ కులు వస్తున్నారు. జిల్లా కేంద్ర గ్రంఽథాలయం లో వివిధ రకాలైన సంబంధించిన 55 వేల పుస్తకాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ దినపత్రికలు 24 ప్రతీ రోజు వస్తు న్నాయి. గ్రూప్స్, సివిల్స్, బీఎడ్, డీఏడ్, రైల్వే, పోలీస్, ఎప్‌సెట్ తదితర పోటీ పరీక్షలకు అవ సరమైన పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకా లు అందుబాటులో ఉండటంతో నిరుద్యోగులు రోజంతా అక్కడే ఉండి చదువుకుంటున్నారు. వారి సౌకర్యం కోసం 22 కంప్యూటర్లు ఉన్నాయి. వైఫై సదుపాయాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ గ్రంథాలయం తెరిచే ఉండటం వల్ల వారికి మరింత ప్రయోజనం కలుగుతోంది. దీంతో పేద విద్యార్థులు, నిరుద్యోగులకు గ్రంథాలయం వరంగా మారింది. ఈ నెల 14 నుంచి 20 వరకు వారో త్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగం గా 15న పుస్తక ప్రదర్శన, 16న ఉపన్యాసం, 17న డ్రాయింగ్, 18న వ్యాసరచన, 19న రం గోలి పోటీలు నిర్వహించనున్నారు. 20వ తేదీన బహుమతుల ప్రదానంతో వారోత్సవాలు ముగి యనున్నాయి.
ఇరుకు గదుల్లో ఇక్కట్లు
- నిధుల కొరతతో నిలిచిన నూతన భవన నిర్మాణం
నారాయణపేట జిల్లా కేంద్ర గ్రంథాలయం ఇరుకు గదుల్లో, అరకొర వసతుల మధ్య కొనసాగుతోంది. ఇక్కడ 17,300 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ రోజూ 50 మందికి పైగా పాఠకులు వస్తుంటారు. మూత్ర శాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రంథాలయం కోసం పట్టణ శివారులోని ఎర్రగుట్ట వద్ద రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నూతన భవన నిర్మాణం నిధుల కొరతతో నిలిచి పోయింది.
అందరి సహకారంతో అభివృద్ధి
అందరి సహకారంతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అసంపూర్తిగా ఉన్న నూతన భవన నిర్మాణాన్ని మునిసిపల్ నిధులతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరం మేరకు పూర్తి స్దాయి సిబ్బందిని నియ మించి, అదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతాం.
- వార్ల విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పేట
‘ఒకటి’దే పెద్ద సమస్య
- మూత్రశాల ఒకటే ఉండటంతో ఇబ్బంది
వనపర్తి జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథా యానికి నూతన భవనం ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చింది. కానీ మహిళలు, పురుషులకు ఒకే మూత్రశాల ఉండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు ప్రతీ రోజు వంద నుంచి 120 మంది వరకు వస్తున్నారు. వారితోనే హాల్ మొత్తం నిండిపోవడంతో దినపత్రికలు చదివే వారు కూర్చునేందుకు స్థలం సరిపోవడం లేదు.
త్వరలో మూత్రశాలల నిర్మాణం
జిల్లా గ్రంథాలయంలో అదనంగా మరో మూడు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇంకా ప్రొసీడింగ్ రాలేదు, రాగానే పనులు ప్రారంభిస్తాం.
- గోవర్ధన్ సాగర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వనపర్తి
అభివృద్ధికి నోచుకోని గ్రంథాలయం
- నత్తనడకన నూతన భవన నిర్మాణం
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సాధారణ పాఠకు లతో పాటు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ దాదాపు 24 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ కూర్చునేందుకు స్థలం సరిపోక పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. గ్రంథాలయం కోసం రూ.1.60 కోట్ల వ్యయంతో చేపట్టిన నూతన భవన నిర్మాణం ఏడాది క్రితం ప్రారంభమైనా, ఇప్పటికీ బేస్‌మెంట్ వరకే పరిమితమైంది.
భవన నిర్మాణ పూర్తికి చర్యలు
జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజా ప్రతినిధుల సహకారంతో భవన నిర్మాణం పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తాం.
- నీలి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, గద్వాల
వసతులు లేక అవస్థలు
- అసంపూర్తిగా నూతన భవన నిర్మాణం
నాగర్‌కర్నూల్ జిల్లా గ్రంథాలయాన్ని పాత మునిసిపాలిటీ భవనంలో కొనసాగిస్తున్నారు. అందులోని చిన్న గదుల్లో పాఠకులు కూర్చునేందుకు స్థలం సరిపోవడం లేదు. లైబ్రరీలో దాదాపు 16 వేల పుస్తకాలున్నాయి. కానీ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లేకపోవడంతో అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్లు ఉన్నా స్థలం సరిపోక వినియో గించుకోవడం లేదు. జిల్లా గ్రంథాలయం కోసం చేపట్టిన నూతన భవన నిర్మాణ పనులు మూడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.
త్వరలో నూతన భవనంలోకి మారుస్తాం
నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారుల సహకారంతో ఆర్థిక వనరులను సమకూర్చుకుని, అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తాం. నూతన భవన నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయించి, అందుబాటులోకి తీసుకొస్తాం.
- రాజేందర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్, నాగర్‌కర్నూల్