Share News

డాక్టర్‌ నిర్లక్ష్యంతో గర్భిణి మృతి

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:32 PM

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కడుపులో బిడ్డ పరిస్థితి విషమించి తల్లి మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నారా యణపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

 డాక్టర్‌ నిర్లక్ష్యంతో గర్భిణి మృతి
ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులు

- ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

నారాయణపేట టౌన్‌, జూన్‌ 14 : వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కడుపులో బిడ్డ పరిస్థితి విషమించి తల్లి మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నారా యణపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఊట్కూరు మండలానికి చెందిన సమీనాబేగాన్ని (28) ఆరేళ్ల కిందట మక్తల్‌కు చెందిన కారు మెకానిక్‌ అంజద్‌తో వివాహం జరిపించారు. రెండు ప్రసవాల్లో ఆపరేషన్‌ ద్వారా కూతురు, కుమారుడికి జన్మనిచ్చింది. సమీనా బేగం ప్రస్తుతం గర్భవతిగా ఉన్నది. చికిత్స కోసం మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బైక్‌పై వచ్చారు. వైద్యం చేయించుకొని తిరుగు ప్రయాణంలో కొల్లూరు స్టేజీ వద్ద బైక్‌పై నుంచి కిందపడ్డారు. తిరిగి వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చి అడ్మిట్‌ అయ్యారు. పరీక్షించి కడుపులో బిడ్డ బాగానే ఉందని సూచించారు. సమీనాబేగం ఆస్పత్రిలోనే ఉన్నారు. గురువారం స్కానింగ్‌ చేసి కడుపులో బిడ్డ చనిపోయిందని డాక్టర్‌ కుటుంబ సభ్యులకు తెలిపారు. చనిపోయిన బిడ్డను తీసి తల్లిని కాపాడాలని కుటుంబ సభ్యులు డాక్టర్‌ను కోరారు. చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని డాక్టర్‌ సూచిండంతో డబ్బులు కూడా చెల్లించారు. ఆ తర్వాత తల్లి పరిస్థితి విషమంగా ఉందని మహబూబ్‌నగర్‌కు రెఫర్‌ చేశారు. సమీనాను కుటుంబసభ్యులు గురువారం రాత్రి హైదరాబాద్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిన్నట్లు వైద్యులు తెలిపారు. దీని అంతటికి డాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమని శుక్రవారం నారాయణపేట పట్టణంలోని ఆసుపత్రి ముందు మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఇందులో డాక్టర్‌ తప్పేమి లేదని బాధిత కుటుంబసభ్యులకు వివరించారు. సకాలంలో చికిత్స చేసి ఉంటే తమ కూతురు బతికేదని వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కడుపు లో బిడ్డ, తల్లి చనిపోయిందని ఆరోపించారు. బాధిత కుటుంబసభ్యులు రూ.10లక్షలు డిమాండ్‌ చేస్తూ ఆందోళన తీవ్రం చేయడంతో సంబంధిత డాక్టర్‌ను పిలిపించి డిమాండ్‌ చేసిన దానికన్నా కొంత తక్కువ డబ్బులు ఇప్పించి సమస్యను పరిష్కరించిన్నట్లు తెలిసింది.

Updated Date - Jun 14 , 2024 | 11:32 PM