భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:37 PM
భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణతో పాటు న్యాయం లభిస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
- గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణతో పాటు న్యాయం లభిస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా సేవలు ఉంటా యన్నారు. మహిళలు ఈ సెంటర్ సేవలపై అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ నిర్మాణానికి మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.2.10 కోట్లు వెచ్చిండం గొప్ప విషయమన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 195 కేసులు నమోదు కాగా 158 పోక్సో కేసులు ఉన్నాయని, అన్నింటికి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. 138 మంది బాధిత మహిళలకు రూ. 35 లక్షల నష్టపరిహారం ఇప్పించినట్లు ఆయన తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన 14 మంది బాధిత మహిళలకు రూ. 1లక్షా17 వేలు అందిం చామని, ఒక పోక్సో నిందితుడికి మూడేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అదనపు ఎస్పీ గుణశేఖర్, జిల్లా సంక్షేమాధికారి సుధారాణి, డీఎస్పీ సత్యనారాయణ, సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, మెగా కంపెనీ అసోసియేట్ జనర్ మేనేజర్ నాగరాజు, పోలీస్ అధికారులు ఉన్నారు.