Share News

సీడ్‌ ఆర్గనైజర్‌ బండ్ల రాజశేఖర్‌రెడ్డి అరెస్ట్‌

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:29 PM

ఆత్మహత్యాయత్నం చేసి, మృతి చెందిన బాలిక కేసులో ప్రధాన నిందితుడు బండ్ల రాజశేఖర్‌ రెడ్డిని ఆదివారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ టంగుటూరి శ్రీను తెలిపారు.

సీడ్‌ ఆర్గనైజర్‌ బండ్ల రాజశేఖర్‌రెడ్డి అరెస్ట్‌
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బండ్ల రాజశేఖర్‌రెడ్డికి చెందిన మెడికల్‌ రిపోర్టులను పరిశీలిస్తున్న వైద్యురాలు

- కర్ణాటక రాష్ట్రం, రాయిచూరులో పట్టుబడిన నిందితుడు

- వెల్లడించిన సీఐ టంగుటూరి శ్రీను

గద్వాల క్రైం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఆత్మహత్యాయత్నం చేసి, మృతి చెందిన బాలిక కేసులో ప్రధాన నిందితుడు బండ్ల రాజశేఖర్‌ రెడ్డిని ఆదివారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ టంగుటూరి శ్రీను తెలిపారు. జోగు ళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సీఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. మల్దకల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బండ్ల రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో పని చేస్తుండేది. ఆమెపై బంగారు నగల దొంగతనం మోపడంతో మనస్తాపానికి గురై గత నెల 11న పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. కర్నూల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 24వ తేదీన మృతి చెందింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీడ్‌ ఆర్గనైజర్‌ బండ్ల రాజశేఖర్‌రెడ్డి పరారయ్యాడు. ఆయన ఆచూకీ కోసం పోలీసు శాఖ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో తనిఖీలు చేసింది. ఈ క్రమంలో ఆదివారం కర్ణాటకలోని రాయిచూర్‌లో నిందితుడు బండ్ల రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి గద్వాలకు తీసుకొచ్చారు. రాత్రి ఆయనను సీఐ కార్యాలయంలోనే ఉంచి, సోమవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చగా, న్యాయాధికారి ఆదేశం మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా, మల్దకల్‌ ఎస్‌ఐపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని విలేకరులు ప్రశ్నించగా, విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. అయితే అంతకుముందు నిందితుడు ముందస్తు బెయిల్‌ కోసం రెండు సార్లు ప్రయత్నించినా, ఫలితం దక్కలేదని సమాచారం.

Updated Date - Nov 11 , 2024 | 11:34 PM