Share News

ఆరు గ్యారెంటీలు.. 66 మోసాలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:28 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ఆరు గ్యారెంటీలు.. 66 మోసాలు అన్న చందంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.

ఆరు గ్యారెంటీలు.. 66 మోసాలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి

జడ్చర్ల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ఆరు గ్యారెంటీలు.. 66 మోసాలు అన్న చందంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. జడ్చర్లలోని అంబేడ్కర్‌ కళా భవన్‌లో సోమవారం కాంగ్రెస్‌ మోసాలను ఎండగడుతూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు, కాంగ్రెస్‌ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసేందుకు కాంగ్రెస్‌ వైఫల్యాల చార్జిషీట్‌ను బీజేపీ నాయకులు విడుదల చేసి, మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసాడని ఆరోపించారు. రైతుబంధుతో ఎకరాకు రూ.15 వేలు, మహలక్ష్మీ పథకంతో ప్రతీ మహిళకు నెలకు రూ.2,500, నూతన రేషన్‌కార్డులు జారీ, పెన్షన్‌ను రూ.నాలుగు వేలకు పెంచుతామని, నిరుద్యోగులకు రూ.మూడు వేల నిరుద్యోగభృతి ఇస్తామని, తెలంగాణ అమరవీరులకు 250 గజాల ప్లాటు, పంటబీమా పథకం తదితరవి అమలుకు నోచుకోని హమీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. విద్యారంగానికి ఆరు నుంచి 15 శాతానికి నిధులు పెంచుతామని వాగ్దానం చేసి, నేటికీ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేదిశగా డిసెంబరు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలాత్రిపురసుందరి, జనార్దన్‌రెడ్డి, ఎంబీ బాలకృష్ణ, బాలవర్దన్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, నాగరాజు, సాహితిరెడ్డి, మధుగౌడ్‌, తిరుపతి, రమేశ్‌జీ, శ్రీకాంత్‌ ఉన్నాయి.

Updated Date - Dec 02 , 2024 | 11:28 PM