నిందితులను శిక్షించాలి
ABN , Publish Date - Nov 11 , 2024 | 11:27 PM
నాలుగురోజుల క్రితం మండలంలోని ఎంజీ కాలనీ తండాలో ఓ గిరిజన రైతును హత్యచేసిన సంఘటనలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించి నిందితులను పట్టుకుని శిక్షించాలంటూ గిరిజనులు సోమవారం వెల్దండ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
- పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
వెల్దండ, నవంబరు 11 : నాలుగురోజుల క్రితం మండలంలోని ఎంజీ కాలనీ తండాలో ఓ గిరిజన రైతును హత్యచేసిన సంఘటనలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించి నిందితులను పట్టుకుని శిక్షించాలంటూ గిరిజనులు సోమవారం వెల్దండ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈనెల ఎనిమిది న ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజునాయక్ అనే రైతు తన భార్య హిమబిందుతో కలిసి రాత్రి సమయంలో సమీపంలోని వ్యవసాయ పొలానికి వేరుసెనగ పంటకు కాపలాగా వెళ్లాడు. ఇద్దరు పడుకుని ఉన్న క్రమంలో తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రాజునాయక్‌ను హత్యచేశారు. దీంతో హిమబిందు చుట్టుప్రక్కన రైతులకు విషయాన్ని చేరవేసింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో విచారణ చేపట్టారు. కాగా మృతుడి భార్య, తండాకు చెందిన ఓ వ్యక్తిు, మరో బాలుడు, హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరితో కలిసి రాజునాయక్‌ను హత్యచేసినట్లు గ్రామంలో ప్రచారం జరిగింది. కాగా పోలీసులు అప్పటికే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. కాగా కేసులో తండాకు చెందిన వ్యక్తిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తూ సోమవారం స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్‌ఐ కురుమూర్తి ఆందోళకారులను శాంతపరిచారు. నిందితులను గుర్తించి శిక్షపడేలా చూస్తామని, ఎటువంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు.