సర్వమతాల సారం ఒక్కటే..
ABN , Publish Date - Nov 07 , 2024 | 10:49 PM
సర్వమతాల సారం ఒక్కటేనని.. మానవులంతా సమానమేనని.. అందరూ కలిసికట్టుగా ఉండి శాంతి, సమానతలను పాటించాలని వక్తలు అన్నారు.
- మానవులందరూ శాంతి సమానతలను పాటించాలి
- సర్వధర్మ సమ్మేళనంలో వక్తలు
నారాయణపేటరూరల్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సర్వమతాల సారం ఒక్కటేనని.. మానవులంతా సమానమేనని.. అందరూ కలిసికట్టుగా ఉండి శాంతి, సమానతలను పాటించాలని వక్తలు అన్నారు. గురువారం మండలంలోని కొల్లంపల్లి ఖతాల్ హుసేనీ దర్గాలో 550వ ఉర్సులో భాగంగా 24వ సర్వధర్మ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తారీఖ్‌అన్సారీ, వివిధ మతాల పీఠాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తారీఖ్‌అన్సారీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ శాంతి, సమానతలను పాటిస్తూ కలిసికట్టుగా ఉండాలన్నారు. అన్ని మతాలకు చెందిన గ్రంథాల్లో అందరూ సమానమేనని చెప్పడం జరిగిందన్నారు. పీఠాధిపతులు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ శాంతి, సమానతలను పాటిస్తూ దైవ చింతనలో మెలగాలన్నారు. సర్వజనులు సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. శాంతి మార్గంలోనే భక్తి ఏర్పడుతుందని ఈ భక్తితో ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూడాలన్నారు. ఐకమత్యంతోనే దేశాన్ని రక్షించుకోవాలన్నారు. పేట జిల్లాలోని కొల్లంపల్లి దర్గాలో సర్వమతాలను ఐక్యం చేసేందుకు గాను సర్వధర్మ సమ్మేళనం నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ జలాల్‌హుసేనీ, పేట మునిసిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, బీజేపీ నాయకుడు నాగురావు నామాజీ, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, నాయకులు నందునామాజీ, సలీం, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జనార్దన్‌గౌడ్, వివిధ మఠాల పీఠాధిపతులు, అష్రఫియా ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.