Share News

‘పెసా’ చట్టాన్ని అమలు చేయాలి

ABN , Publish Date - Dec 24 , 2024 | 11:57 PM

‘పెసా’ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తేనే, ఆదివాసీల హ క్కుల సాధన సాధ్యం అవుతుందని చెంచు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చిగుర్ల మల్లికార్జున్‌ అన్నారు.

‘పెసా’ చట్టాన్ని అమలు చేయాలి
ర్యాలీలో నినాదాలు చేస్తున్న గిరిజనులు, నాయకులు

- చెంచు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చిగుర్ల మల్లికార్జున్‌

మన్ననూర్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ‘పెసా’ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తేనే, ఆదివాసీల హ క్కుల సాధన సాధ్యం అవుతుందని చెంచు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చిగుర్ల మల్లికార్జున్‌ అన్నారు. పెసా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా, అమ్రాబాద్‌ మండలం మన్ననూరులోని గిరిజన భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లమలలో పర్యాటక అభివృద్ధి, ఆలయాల్లో జరిగే ఉత్సవాలు పెసా గ్రామ సభ అనుమతితోనే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఐటీడీఏ ద్వారా నియమించిన పెసా మొబిలైజర్‌ను తొలగించా లన్నారు. గ్రామ సభలో తీర్మానం చేసి, మొబిలైజర్‌ను ఎంపిక చేసుకునే అధికారాన్ని ఆదివాసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీల అభివృద్ధికి అడ్డంకిగా మారిన పునరావాస ప్యాకేజీలను తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం, ఎఫ్‌ఆర్‌సీ, పెసా కమిటీల తీర్మానం లేకుండానే 2006లో అమ్రాబాద్‌ టైగర్‌ సాంచరీని ఏర్పాటు చేశారని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఐటీడీఏ ఏర్పాటై 10 సంవత్సరాలవుతున్నా, రెగ్యులర్‌ పీవోను, పూర్తి స్థాయి అధికార యంత్రాంగాన్ని నియమించలేదని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం తాము ఎన్ని సార్లు పాదయాత్ర చేపట్టినా, అధికారులు పలు హామీలు ఇస్తూ ఆపుతున్నారని చెప్పారు. మూడు నెలల్లో ఆదివాసీ చెంచుల సమస్యలను పరిష్కరించకుంటే, మరోసారి చలో అసెంబ్లీ పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. అంతకుముందు చెంచు నాయకులు గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి డప్పుల మోత, చెంచుల నృత్యాలతో ర్యాలీగా గిరిజన భవన్‌కు చేరుకున్నారు. సమావేశంలో చెంచు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండ్లి చిన్న అంజయ్య, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకులు మద్దునూరి లక్ష్మీనారాయణ, బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్‌ వెంకటేష్‌, ఆదివాసీ చెంచు నాయకులు నిమ్మల లింగస్వామి, పెద్ద బయ్యన్న, అంజయ్య, ముత్తమ్మ, గురువమ్మ, లక్ష్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 11:57 PM