పడిపోయిన టమాట ధర
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:59 PM
నారాయణపేట జిల్లాలో టమాట ధరలు పది రోజులుగా పడిపోతున్నాయి. 15 రోజుల కిందట 25 కిలోల బాక్స్ ధర రూ.1,000 నుంచి రూ.1,200 ఉండగా.. ప్రస్తుతం రూ.250 నుంచి రూ.200 వరకు ధరలు తగ్గాయి. అంటే కిలో ధర రూ.ఎనిమిదికి చేరడంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
25 కిలోల బాక్స్ రూ.200లకే
పక్షం రోజుల కిందట రూ.1,200
దిగుబడి పెరగడంతో తగ్గిన రేట్లు
ఆందోళనలో రైతులు
బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయం
నారాయణపేట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలో టమాట ధరలు పది రోజులుగా పడిపోతున్నాయి. 15 రోజుల కిందట 25 కిలోల బాక్స్ ధర రూ.1,000 నుంచి రూ.1,200 ఉండగా.. ప్రస్తుతం రూ.250 నుంచి రూ.200 వరకు ధరలు తగ్గాయి. అంటే కిలో ధర రూ.ఎనిమిదికి చేరడంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో కొందరు రైతులు తోట నుంచి టమాటను ఏరేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. అదే బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు కిలోకు రూ.15 నుంచి రూ.20 చొప్పున అమ్ముతున్నారు. స్థానికంగా దిగుబడి పెరగడంతో పాటు కర్ణాటక రాష్ట్రం రాయచూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు నుంచి హైబ్రిడ్ టమాటను స్వల్పంగా దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు తగ్గాయని తెలుస్తోంది. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 479 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేశారు. టమాటా 46 ఎకరాల్లో సాగు చెయ్యగా, ఉల్లిగడ్డలు 175, పచ్చి మిర్చి 82, వంకాయ 25 ఎకరాల్లో సాగు చేశారు. 151 ఎకరాల్లో ఆకు కూరలతో పాటు ఇతర కూరగాయలు వేశారు. నారాయణపేట మండలం సింగారం, జాజాపూర్, శాసన్‌పల్లి, శేర్నపల్లి, పేరపళ్ల, అప్పిరెడ్డిపల్లి, బోయలపల్లి, అప్పక్‌పల్లి తదితర గ్రామాల్లో టమాట 30 ఎకరాల్లో సాగు చేశారు. పది రోజులుగా టమాట ధరలు రోజు రోజుకు తగుతున్నాయి. 25 కిలోల బాక్స్ ధర రూ.1200 నుంచి ఇప్పుడు రూ.200లకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి అటుంచితే.. టమాటను మార్కెట్‌కు తెచ్చేందుకు రవాణా చార్జీలు కూడా రావడం లేదని వాపోతున్నారు.