Share News

ఎన్నికల జోరు.. హామీల హోరు

ABN , Publish Date - Dec 28 , 2024 | 10:59 PM

కాలగతిలో 2024 కలిసిపోనుంది. ఈ ఏడాది కొందరికి చేదు అనుభవాలను మిగిల్చగా.. మరికొందరికి తీపి జ్ఞాపకాలను అందించింది. ము ఖ్యంగా రాజకీయ యవనికపై ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా చెప్పకోవాల్సి ఉంది. ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారనే విషయాలు మాత్రమే కాకుండా భిన్నమైన తీర్పులను ప్రజలు ఇచ్చారు.

ఎన్నికల జోరు.. హామీల హోరు
నాగర్‌కర్నూల్‌ విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (ఫైల్‌)

ఈ సంవత్సరం పార్లమెంటు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలతో హడావిడి

రెండు సిట్టింగు సీట్లను కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీతో ఊరట

బీజేపీ రెండోసారి పాలమూరు స్థానంపై విజయ ఢంకా

గ్యారెంటీల అమలును ప్రాధాన్యంగా తీసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

సొంత జిల్లా కావడంతో ఎక్కువసార్లు పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి

స్థానిక సంస్థలపై బీజేపీ గురి.. ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు డ్రైవ్‌

నిర్మాణంపై దృష్టి సారించని.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌..

వ్యక్తులపైనే ఆధారం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాలగతిలో 2024 కలిసిపోనుంది. ఈ ఏడాది కొందరికి చేదు అనుభవాలను మిగిల్చగా.. మరికొందరికి తీపి జ్ఞాపకాలను అందించింది. ము ఖ్యంగా రాజకీయ యవనికపై ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా చెప్పకోవాల్సి ఉంది. ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారనే విషయాలు మాత్రమే కాకుండా భిన్నమైన తీర్పులను ప్రజలు ఇచ్చారు. 2023 సంవత్సరం చివర్లోనే రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎ్‌సను గద్దె దించుతూ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రజలు అనూహ్యమైన మెజారిటీలతో గెలిపించి అధికారం అప్పగించిన విషయం తెలిసిందే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం రెండింటిలో బీఆర్‌ఎస్‌ గెలుపొందగా.. 2025 ప్రారంభంలోనే అందులో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్‌ కావడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. దీంతో ఆ పార్టీ బలం ఒకటికి పడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీపడ్డారు. పూర్తి గెలుపు జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలోకి చాలామంది స్థానిక సంస్థల ఓటర్లు చేరడంతో తమ అభ్యర్థి గెలుపు తథ్యమేనని భావించారు. కానీ సంఖ్యాపరంగా అప్పటికే బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గోవా, కర్ణాటక, హైదరాబాద్‌లో క్యాంపులు, ఓటర్లకు భారీగా ముడుపులు, కౌంటింగ్‌ వాయిదాలు నడుమ బీఆర్‌ఎ్‌సను విజయం వరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన తర్వాత ఈ గెలుపు ఆ పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపిందని చెప్పవచ్చు.

పార్లమెంట్‌ హోరాహోరీ..

ఈ ఏడాది ప్రథమార్థంలోనే పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. అప్పటికే అసెంబ్లీ గెలుపుతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రయత్నించింది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా సొంత జిల్లాలో అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన రెండు పార్లమెంటుల పరిధిలో ఏకంగా పదిసార్లు పర్యటించగా, ఒకసారి రాహుల్‌గాంధీ హాజరయ్యారు. నోటిఫికేషన్‌ విడుదలయ్యే రోజు నాగర్‌కర్నూల్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, నారాయణపేట ప్రచార సభలోనూ పాల్గొన్నారు. వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రచారాన్ని వేడెక్కించారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య జరుగగా, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఓటమి, పార్లమెంట్‌ స్థానాన్ని కోల్పోవడం కాంగ్రెస్‌ పార్టీకి కొంత మైనస్‌ అయ్యింది. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌లో మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. అయినప్పటకీ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి భారీ మెజారిటీతో గెలుపొందారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎఫర్ట్‌ను బీజేపీ ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో పెట్టింది. అసెంబ్లీతో పోల్చితే తన ఓటుబ్యాంకును గణనీయంగా పెంచుకుంది. ఇక బీఆర్‌ఎస్‌ రెండు సిట్టింగు స్థానాల్లో ఓటమి చెంది, ఓటు బ్యాంకును భారీగా కోల్పోయింది. ఈ ఏడాది జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. అయితే స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మిగతా పార్టీలు మాత్రం పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదు. వ్యక్తి కేంద్రంగానే రాజకీయాలు చేస్తుండటంతో పార్టీ బలోపేతంపై చర్చ చేయడం లేదు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రె్‌సలో వర్గపోరుతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

గ్యారంటీల అమలుపై ఫోకస్‌..

కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ఫోకస్‌ పెట్టింది. అదే సమయంలో బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు గ్యారంటీల అమలులో ఏర్పడుతున్న ఇబ్బందులు, అమలు కానీ హామీలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయని చెప్పొచ్చు. 2023లోనే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంపు అమలు చేశారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల కోడ్‌ వల్ల కొంత ఆలస్యమైనా.. తర్వాత నుంచి పథకాలు అమలవుతున్నాయి. ఇక ద్వితియార్థంలో కీలకమైన రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటివరకు రూ. రెండు లక్షలలోపు రుణాలు మాఫీ చేయగా, మాఫీ విషయంలో అధికార, విపక్షాల మధ్య రాజకీయ రగడ నెలకొంది. మాఫీ సరిగా చేయలేదని బీఆర్‌ఎస్‌ వనపర్తిలో రైతాంగ సదస్సు పేరుతో మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో సభను నిర్వహించింది. అయితే రైతు భరోసా పథకాన్ని అమలు చేయకపోవడం కాంగ్రె్‌సకు కొంత మైన్‌సగా మారింది. అలాగే మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల పెంపు, రేషన్‌కార్డుల జారీని అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి కొంత నిరసన ఎదురవుతుందని చెప్పొచ్చు. రెండు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు, పాలమూరుకు ఇంజనీరింగ్‌, లా కాలేజీ, కొడంగల్‌కు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు మంజూరయ్యాయి. అలాగే ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల మంజూరైనా.. ఇప్పటివరకు నిర్మాణం దిశగా అడుగులు పడలేదు. నారాయణపేట- మక్తల్‌- కొడంగల్‌ నియోజకవర్గాల చిరకాల వాంఛ అయిన ఎత్తిపోతల పథకం మంజూరు కావడం, టెండర్లు కూడా పూర్తి కావడం ఆ ప్రాంతాల ప్రజలకు సంతోషం కలిగించిందని చెప్పవచ్చు.

Updated Date - Dec 28 , 2024 | 10:59 PM