పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:01 PM
పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి అని ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల అన్నారు.
- ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల
- స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ ప్రారంభం
మరికల్, అక్టోబరు 1 : పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి అని ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద స్వచ్ఛ భారత్ ర్యాలీని ట్రైనీ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రధాన వీధుల గేండా ఇందిరాగాంధీ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలన్నా.. ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండాలన్నా.. నిత్యం పారిశుధ్య కార్మికులు విధుల్లో ఉండాలన్నారు. ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి, ఆ వ్యర్థాలను ఎలా తొలగించాలనే అంశంపై విద్యార్థులకు సూచనలు చేశారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువుల వాడకాలను నిర్మూలించడం కేవలం యువతతోనే సాధ్యం అన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాఽఽధిస్తారని గుర్తు చేశారు. వీలైనంత వరకు ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలన్నారు. అంతకుముందు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న ట్రైనీ కలెక్టర్ విద్యార్థులతో కలిసి కొద్ది సేపు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి బొడ్డెమ్మ వేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొండన్న, తహసీల్దార్ జమీల్, పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రెడ్డి, హెచ్‌ఎం నాగరతమ్మ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.