జిల్లాలో 64 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ABN , Publish Date - Mar 27 , 2024 | 11:07 PM
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 64 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు తెలిపారు.
- అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏడు చెక్ పోస్టులు
- అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు
గద్వాల న్యూటౌన్, మార్చి 27 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 64 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. మొదటి విడతగా ఏప్రిల్ నాలుగవ తేదీన గద్వాల మండలంలో 18, గట్టులో ఐదు, కేటీదొడ్డిలో తొమ్మిది, మొత్తం 32 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. మరో 32 కేంద్రాలు ఏప్రిల్ 10న రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 43, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 21 కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా సజావుగా సేకరించనున్నట్లు చెప్పా రు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. వరి-ఏ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ. 2,203, సాధారణ రకానికి రూ. 2,183 మద్దతు ధర చెల్లించ నున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమ శాతం 17కు తక్కువగా ఉండేట్లు చూసుకోవాలని రైతులకు సూచిం చారు. బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు, పట్టాపాస్‌బుక్ తీసుకురావాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా తరలిరాకుండా నందిన్నె, ఇర్కిచేడు, బల్లెర, ర్యాలంపాడు, సుంకేసుల, పుల్లూరు, బైరాపురం గ్రామాల వద్ద ఏడు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.