Share News

దాబాల్లో మద్యం జోరు

ABN , Publish Date - Nov 03 , 2024 | 10:57 PM

జాతీయ రహదారి వెంట ఉన్న ధాబాల్లో మద్యం విక్రయాలతో పాటు సిట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి.

దాబాల్లో మద్యం జోరు

- బార్లను తలపిస్తున్న సిట్టింగులు

- పట్టించుకోని అధికారులు

అలంపూర్‌ చౌరస్తా, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారి వెంట ఉన్న ధాబాల్లో మద్యం విక్రయాలతో పాటు సిట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. అలంపూర్‌ క్లస్టర్‌ పరిధిలో 15 వైన్స్‌ షాపులు, ఒక బార్‌ ఉంది. జాతీయ రహదారి సమీపం వెంట ఆరు వైన్స్‌ షాపులు ఉన్నాయి. గత నెల వరకు ఈ వైన్స్‌ షాపుల ద్వారా రోజుకు రూ.కోటికి పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. పెబ్బేరు నుంచి ఏపీ తెలంగాణ సరిహద్దు వరకు రెండు వైపులా సుమారు 20 ధాబాలు ఉన్నాయి. ఇందులో సగానికిపైగా ధాబాల్లో మద్యం విక్రయాలతో పాటు సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక అలంపూర్‌ చౌరస్తా, టోల్‌ ప్లాజా సమీపంలోని కొన్ని ధాబాలు మినీ వైన్స్‌ షాపులను తలపిస్తున్నాయి. సమీపంలో కర్నూలు నగరం ఉండటం, జాతీయ రహదారి వెంట ప్రయాణించే వాహనదారుల తాకిడితో మధ్యాహ్నం నుంచి ధాబాలు కిక్కిరిసిపోతుంటాయి. కోదండాపురం, జల్లాపురం, ఉండవల్లి క్రాస్‌రోడ్డు, అలంపూర్‌ చౌరస్తా, టోల్‌ప్లాజా సమీపంలో ఉన్న ధాబాల్లో మద్యం విక్రయాలు, సిట్టింగులు జోరుగు నడుస్తున్నాయి. సీసాపై రూ.30 అధికంగా విక్రయిస్తున్నారు. ధాబాల్లో మద్యం సేవించాలంటే కనీసం వంద నుంచి రూ.300 బిల్లు చేయాలన్న నిబంధన సైతం అమలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ధాబాల్లో ఆహార ధరలు ఆకాశన్నంటుతున్నాయి. మొత్తానికి సిట్టుంగులు ఏర్పాటు చేసి ధాబాల యజమానులు సొమ్ము చేసుకుంటున్నా.. నిత్యం రోడ్డు వెంట తిరిగే అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే గాక ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు. ఇదీగాక దొంగతనాలు కూడా పెరిగాయి. ఆగస్టు 13 రాత్రి టోల్‌ప్లాజా వద్ద స్కందకాలనీలోకి వెళ్తున్న వీరేష్‌ అనే వ్యక్తిని ముగ్గురు దుండగులు దారిలో అడ్డగించి నగదు, వెండి ఆభరణాలు, మొబైల్‌ ఫోను దోచుకెళ్లారు. ఏపీలో నూతన మద్యం పాలసీ వచ్చినా.. కొన్ని బ్రాండ్లపై అక్కడ అధిక ధరలు ఉండటంతో ఇక్కడ ఇంకా ఏపీ మద్యం బాబుల రద్దీ తగ్గలేదు.

Updated Date - Nov 03 , 2024 | 10:57 PM