Share News

నేడు కురుమూర్తికి సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:02 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయానికి రానున్నారు.

నేడు కురుమూర్తికి సీఎం రేవంత్‌రెడ్డి

బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

ఎలివేటెడ్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, డీఐజీ

చిన్నచింతకుంట, నవంబరు 9: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయానికి రానున్నారు. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం రానుండటంతో దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మదుసూదన్‌రెడ్డి శనివారం జాతర మైదానంలో డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, అదనపు కలెక్టర్‌ శివేంద్ర పతా్‌పతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జాతర మైదానంలో పర్యటించారు. ఆలయ రాజగోపురం సమీపంలోని స్టేజీ వద్ద అపరిశుభ్రత నెలకొందని, అక్కడ చెత్తా చెదారాన్ని తొలగించాలని అధికారులకు సూచించారు. కాగా, సీఎం రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి కొత్తకోట మీదుగా కురుమూర్తికి రానున్నారు.

భక్తులకు ఆంక్షలు లేవు

ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయానికి రానున్నారని చెప్పారు. అందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఆలయం గుట్టపైకి రూ.110 కోట్లతో మంజూరైన ఎలివేటెడ్‌ కారిడార్‌తో కూడిన ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమిపూజ చేస్తారని తెలిపారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని, గుట్టకింద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. సీఎం రాక సందర్భంగా భక్తులకు ఎలాంటి ఆంక్షలు లేవని, యధావిధిగా స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపారు. దుకాణాలు కూడా తెరుచుకొని ఉంటాయన్నారు. సమావవేశంలో ఆలయ చైర్మన్‌ గోవర్దన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, నాయకులు వట్టెం శివకుమార్‌, గూడూరు శేఖర్‌, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:02 PM