నేడు అలంకారోత్సవం
ABN , Publish Date - Nov 05 , 2024 | 11:39 PM
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
- కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టం
చిన్నచింతకుంట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధానమైన కురు మూర్తి స్వామి అలంకారోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆత్మకూరు ఎస్‌బీఐ నుంచి ఊరేగింపు
కురుమూర్తి వేంకటేశ్వర స్వామికి ముక్కెర వంశపు రాజులు పలు స్వర్ణాభరణాలను సమర్పించారు. అందు లో కిరీటం, కోరమీసం, హస్తాలు, భుజకీర్తులు, శంకు చక్రాలు, పచ్చలు, వజ్ర వైఢూర్యాలు పొదిగిన హారాలు, ముత్యాల హారాలు, మొలగజ్జెలు ఉన్నాయి. ఈ ఆభర ణాల పెట్టను ప్రతీ ఏటా బ్రహ్మోత్సవాల అనంతరం వనపర్తి జిల్లా ఆత్మకూర్ ఎస్‌బీఐలోని లాకర్లో భద్రపరు స్తారు. అలంకారోత్సవం సందర్భంగా బుధవారం ఉద యం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ పాలకవర్గ సభ్యులు, ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో ఆభరణాల పెట్టెను లాకర్‌లో నుంచి బయటకు తీసు కొస్తారు. అక్కడి నుంచి ఊరేగింపు ప్రారంభం అవుతుంది.
ఊరూరా ప్రత్యేక పూజలు
ఊరేగింపులో గాడీ వంశీయులైన స్వర్ణకా రులు ఆభరణాల పెట్టెను తలపై పెట్టుకుని ముందు నడుస్తారు. భారీ పోలీసు బందోబస్తు, భక్తుల గోవింద నామస్మరణ, మంగళ వాయిద్య ఘోష నడుమ ఊరేగింపు కొనసాగుతుంది. ఆభరణాల ఊరే గింపుకు ప్రతీ గ్రామంలో భక్తులు ఘన స్వాగతం పలి కి పూజలు చేస్తారు. ఆత్మకూరు పట్టణం నుంచి పరమే శ్వరస్వామి చెరువుకట్ట మీదుగా మదనాపురం మండ లం కొత్తపల్లికి ఊరేగింపు చేరుకుంటుంది. అక్కడి నుంచి దుప్పల్లి మీదుగా మధ్యాహ్నం సమయానికి చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలోని ముక్కెర వంశస్తుడు రాజా రాంభూపాల్ నివాసానికి చేరుతుంది. అక్కడ భక్తులతో పాటుగా వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆభరణా లను దర్శించుకుంటారు. వేద పండితు లు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఊరేగింపు ప్రారంభం అవుతుంది.
అమ్మాపూర్ మీదుగా జాతర మైదానానికి...
భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఊరేగింపు అమ్మాపూర్ గ్రామం మీదుగా సాయంత్రం సమయా నికి కురుమూర్తి జాతర మైదానానికి చేరుకుంటుంది. అనంతరం దేవరగట్టు మెట్ల వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు, ప్రముఖులు ఆభరణా లకు ఘన స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఆభరణాల పెట్టెను గుట్టపై నున్న కాంచన గుహకు చేరుస్తారు. అనంతరం స్వామి వారికి ఆభరణాలను అలంకరిస్తారు. కార్యక్ర మానికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శాసన సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, దేవాదాయ శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.