అనిశ్చితి..!
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:47 PM
గద్వాల జిల్లా కేంద్రం సమీపంలోని పూ డూరులో నిర్మించిన ప్రైవేటు గోదాముల విషయం లో కార్మికులకు పని కల్పించే విషయమై అనిశ్చితి నెలకొన్నది.
- హమాలీ కార్డులు ఉన్నా పూడూరు గోదాముల్లో పని కరువు
- గద్వాల జిల్లా కేంద్రంలో 600 మంది కార్మికుల ఎదురుచూపు
- కేసులు, వివాదాల కారణంగా ఆరేళ్లుగా పని కల్పించలేని వైనం
- అన్ని అనుమతులతో తెరిచినా రాజకీయ జోక్యంతో ఆందోళన
- గతంలోనూ ధాన్యం నిల్వలు, తాజాగా సీసీఐ కాటన్ బేల్స్ స్టోర్
- 55 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం, పరోక్షంగా వేల మందికి ఉపాధి
మహబూబ్‌నగర్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గద్వాల జిల్లా కేంద్రం సమీపంలోని పూ డూరులో నిర్మించిన ప్రైవేటు గోదాముల విషయం లో కార్మికులకు పని కల్పించే విషయమై అనిశ్చితి నెలకొన్నది. సుమారు 55 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కౌకుంట్ల గోదాముల తర్వాత పెద్ద గోదాములు ఇక్కడే ఉన్నాయి. గోదాముల నిర్మాణ సమయంలో అందులో హమాలీలుగా పనిచేసేందుకు కార్డులు ఇ ప్పించారు. అధికారికంగా 450 మందికి హమాలీ కార్డులు ఇవ్వగా అంత పెద్ద సామర్థ్యం కలిగిన గోదాముల్లో పనిచేయడానికి మరో 150 మంది హమాలీలు అవసరం పడతారు.
అయితే గోదాముల నిర్మాణ సమయంలో కేసులు, వివాదాలు చాలా నెలకొన్నాయి. అనుమతుల విష యంలో కొంత ఇబ్బందులు ఏర్పడగా అప్పట్లో కో ర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. తర్వాత అన్ని అనుమతులు పొందిన తర్వాతనే గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే, తెలంగాణ డిజా స్టర్ మేనేజ్‌మెంట్, డీటీసీపీ, నాలా, గ్రామ పంచా యతీ అనుమతులు తీసుకున్న తర్వాత ఇటీవల గో దాముల్లో స్టాక్ నిల్వ చేయడం ప్రారంభించారు. కా నీ, ఇప్పటికీ కార్మికులకు పని కల్పించడంలో అనిశ్చి తి నెలకొన్నది. తాజాగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇం డియా నుంచి కాటన్ బేల్స్‌ను నిల్వ చేస్తున్నారు. అప్పట్లో కార్డులు పొందిన వారికి పని కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు కూడా తమకు పని కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం వేరే రాష్ర్టాలకు చెందిన కార్మికుల ద్వారా బేల్స్ లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తుండటంతో కార్మికు ల్లో ఆందోళన నెలకొన్నది. 55 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల్లో నిత్యం 600 మంది హమాలీలకు పని ఉంటుంది. అలాగే 200 పైచిలు కు లారీలు వస్తూ పోతుంటాయి. వీటి ద్వారా కూడా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలనే డిమాండ్ వస్తోంది.
- ఆది నుంచి వివాదాలే...
ఈ గోదాముల నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి వివాదాలు ఉండటంతో కార్మికులు ఇబ్బందు లు పడుతున్నారు. అప్పట్లో కార్మికులుగా నమోదు చేసుకునే క్రమంలో చాలామంది డబ్బులు చెల్లిం చారు. ఒక్కో కార్మికుడికి ఇక్కడ పనిచేస్తే దాదాపు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు కూలీ లభించే అవకాశం ఉంది. అయినా తాము రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నామని గోదాముల యాజమాన్యం తెలుపుతోంది. కోర్టులో పిల్ దాఖలు చేసిన తర్వాత దాదాపు ఆరేళ్లపాటు ఇక్కడ కార్మికు లకు పని లభించలేదు. తర్వాత కోర్టు ఆ పిల్‌కు సంబంధించి ఆర్డర్ ఇచ్చి సంబంధిత శాఖల నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత నిల్వకు అనుమతులు ఇవ్వాలని డీటీసీపీకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్నారు.
ఇప్పటికీ ఏదో రకంగా రాజకీయ ఇబ్బందులు క లిగించే ప్రయత్నం జరుగుతోందని, అందువల్లే తాము స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించలేకపోతు న్నామని యాజమాన్యం చెబుతోంది. ప్రస్తుతం సీసీ ఐ బేల్స్‌ను రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తెచ్చి ఇక్కడ స్టోర్ చేస్తుండటంతో మరోసారి రాజకీయ జోక్యంతో ఇబ్బందులు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తాజాగా కలెక్టర్ కూడా కోర్టు డైరెక్షన్స్ ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయా, లేదా అని పరిశీలించాలని సూచిస్తూ రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు. ఆ మేరకు గోదాముల యాజమాన్యం అన్ని అనుమతులు ఉన్నాయని వివరణ లేఖతో పాటు అనుమతుల ప్రతులను అప్పగించింది.
- ప్రతీ పనిలో రాజకీయ జోక్యం...
వాస్తవానికి ఈ గోదాములు ప్రైవేటువే అయినప్పటికీ వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్లకు ఉపాధి లభిస్తుంది. కానీ, అన్ని అనుమతులు ఉన్నా రాజకీయ ఇబ్బందులు నెలకొన్నాయి. పార్టీలు, ప్రభుత్వాలు మారినా అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గోదాముల యాజమాన్యం చెబుతోంది. కొందరు రాజకీయ నాయకులు డబ్బులు డిమాండ్ చేయడమో, తాము చెప్పినట్లు వినాలని ఆదేశించడమో ఇప్పటికీ జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్డులు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా తమకు ఉపాధి లభించడం లేదని కార్మికులు ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఆస్తులు అమ్మి కొనుగోలు చేసిన మిల్లులో రాజకీయ ఒత్తిళ్లు తగ్గితే వేలాది మందికి ఉపాధి కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని యాజమాన్యం చెబుతోంది. ఇప్పటికే ఆరేళ్లు గోదాముల నిర్వహణ లేకపోవడం వల్ల అప్పులకు వాయిదాలు చెల్లించడానికి ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని అంటోంది.
ఉపాధి కల్పించేందుకు సిద్ధమే
నేను అన్ని ఆస్తులు అమ్ముకొని గోదాములను కొనుగోలు చేశాను. కానీ, ఆ రోజు నుంచి రాజకీయ ఒత్తిళ్లతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ గోదాం వల్ల ప్రత్యక్షంగా 600 మంది కార్మికులు, పరోక్షంగా దాదాపు 2 వేల మంది ఉపాధి పొందుతారు. కోర్టులో పిల్ ఉండటంతో దాదాపు ఆరేళ్లు మూసివేశారు. ఉపాధి పోయింది. ఇప్పుడు అన్నీ పరిష్కరించుకుని, కోర్టు ఆదేశాల మేరకు అన్ని అనుమతులు పొందిన తర్వాత కూడా ఈ ఒత్తిళ్లు తప్పడం లేదు. కార్మికులకు ఉపాధి కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నారు.
- పత్తి రవికుమార్, గోదాముల యజమాని
- ఇప్పటికే చాలా నష్టపోయాం
ఈ గోదాములో లోడింగ్, అన్‌లోడింగ్‌కు చాలామంది అవసరం.. దాదాపు 450 నుంచి 600 మంది హమాలీలు ఉపాధి పొందుతారు. రోజుకు 150 నుంచి 200 లారీలు వస్తుంటాయి. పోతుంటాయి. లారీ యాజమనులకు, డ్రైవర్లకు, క్లీనర్లకు పని ఉంటుంది. ఈ గోదాములను నమ్ముకొని చిరు వ్యాపారులు కూడా ఉపాధి పొందే అవకాశం ఉంది. గోదాములను కొనసాగించాలి.
- మోహిన్, లారీ అసోసియేషన్ సెక్రటరీ
- గోదాంతో చేతినిండా పని
ఈ గోదాము సమీప గ్రామాల్లోని వారికి ఇక్కడ హమాలీ కార్డులు తీసుకున్నాం. గోదాములు అనేక వివాదాల కారణంగా మూతపడ్డాయి. ఇప్పుడు తెరుచుకున్నప్పటికీ వేరే రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. హమాలీ కార్డు తీసుకున్న మేము ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. మళ్లీ మూసివేస్తారనే ప్రచారంతో మాకు ఆందోళన ఉంది. గోదాములో మేము ఉపాధి పొందడానికి సహకరించాలి.
- అభిలాష్, హమాలీ కార్మికుడు
అనుమతితోనే తెరవాలి
పూడూరు గోదాములు కోర్టు డైరె క్షన్ ప్రకారం అనుమతులు తీసుకు న్నారా, లేదా అనేది అధికారులకు తెలుపకుండానే తెరిచా రు. అందువల్ల అనుమతుల పరిశీలన కోసం, అధికారులు సీజ్ చేసిన దాన్ని అధికారులతోనే తెరిపించాలనే విషయంపై నోటీసులు జారీ చేశాం. దాని ప్రకారం పూర్తి వివరాలు తీసుకుంటున్నాం.
- లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల