వినాయక.. సెలవిక
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:18 PM
వినాయక ఇక సెలవు అంటూ భక్తులు గణనాథులకు వీడ్కోలు పలికారు.
- ఘనంగా వినాయక నిమజ్జనం
- బందోబస్తు నిర్వహించిన పోలీసులు
మరికల్/మక్తల్/కోస్గి/దామరగిద్ద/సెప్టెంబరు 15 : వినాయక ఇక సెలవు అంటూ భక్తులు గణనాథులకు వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తులకు అన్నదానం చేశారు. ఆదివారం సాయంత్రం ట్రాక్టర్లను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి గణనాథులను నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగగా, మరికల్ మండలంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలోని ఒగ్గుడోలు, బోనాలతో గణేష్ శోభాయాత్ర సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైంది. యువకుల కోలాటం, డీజే పాటలు, రికార్డింగ్ డ్యాన్సులతో గణనాథునికి సెలవు పలికారు. సాయంత్రం మొదలైన వినాయక నిమజ్జనం సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. అంత కుముందు వినాయక లడ్డూలను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించగా, పలువురు పోటా పోటీగా వేలంలో పాల్గొని దక్కించుకున్నారు. నిమజ్జనానికి తరలి వెళ్లే ప్రతీ వినాయకుడికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ మురళి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.