Share News

వారబందీ పద్ధతిలో నీటి విడుదల

ABN , Publish Date - Dec 04 , 2024 | 11:29 PM

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా వర్షా లు కురవడంతో వానాకాలం సాగు ఆశాజనకంగా సాగింది.

వారబందీ పద్ధతిలో నీటి విడుదల

యాసంగిలో 77వేల ఎకరాలకు సాగునీరు

ఇబ్బందులు లేకుండా సాగునీరందిస్తాం: ఎమ్మెల్యే

గద్వాల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా వర్షా లు కురవడంతో వానాకాలం సాగు ఆశాజనకంగా సాగింది. ఇంకా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండటంతో యాసంగి సాగుకు కూడా నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళికా కమిటీ సమావేశమైంది. ఏయే ప్రాజెక్టులలో ఎంతమేరకు నీటి నిల్వలు ఉన్నాయో నివేదికలను పరిశీలించి ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు సాగును నిర్ణయించింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన జూరాల, నెట్టంపాడు, ఆర్డీఎస్‌ కింద దాదాపు 77వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయిచింది. ఇందులో జూరాల ప్రాజెక్టు కింద 34వేల ఎకరాలకు, నెట్టంపాడు ప్రాజెక్టు కింద 24వేల ఎకరాలకు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ కింద 4,800 ఎకరాలు, ర్యాలంపాడు రిజర్వాయర్‌ కింద 19,200ఎకరాలకు, ఆర్డీఎస్‌ కాలువ కింద 37 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. తుంగభద్ర ప్రాజెక్టులో ప్రస్తుతం 92 టీఎంసీల నీటినిల్వ ఉంది. దామాషా పద్ధ్దతి ప్రకారం ఆర్డీఎస్‌కు దాదాపు ఆరు టీఎంసీల నీళ్లు రావాల్సి ఉన్నా అందులో కొంత తగ్గిన 37 వేల ఎకరాల లో సాగునీరు అందించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రబీకి సాగునీటిని డిసెంబరు 25వ తేదీ నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు వారబందీ పద్ధతిలో అందిస్తామని అధికారులు తెలిపారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలి

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రబీలో కూడా సాగునీరు అందిస్తున్నాం. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. జూరాలకు వరద ఉండటంతో నెట్టంపాడు కింద అన్ని రిజర్వాయర్లను నింపాము. అందుకే ఈ ఏడాది 24 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించాం. అందరు ఆరుతడి పంటలు వేసుకుంటే చివరలో నీటి ఇబ్బందులు ఉండవు.

- బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే

Updated Date - Dec 04 , 2024 | 11:29 PM