Share News

అద్దెదుకాణాల లెక్కతేలేదెన్నడు?

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:48 PM

స్పెషల్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీ అయిన పాలమూరు పురపాలికలో ఏళ్ల తరబడి అద్దె దుకాణాల బాగోతం ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది..

అద్దెదుకాణాల లెక్కతేలేదెన్నడు?
గడియారం చౌరస్తాలోని మునిసిపల్‌ అద్దె దుకాణాలు

- పాలమూరు పురపాలికలో పేరుకు పోయిన అద్దె బకాయిలు

- దశాబ్దకాలంగా ఎగవేస్తున్న వ్యాపారులు

- సబ్‌లీజు పేరుతో గలీజు దందాలు

- కొన్ని దుకాణాలు సీజ్‌..మరికొందరికి నోటీసులు

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 8: స్పెషల్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీ అయిన పాలమూరు పురపాలికలో ఏళ్ల తరబడి అద్దె దుకాణాల బాగోతం ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది.. కొందరికి ఇవి ఏటీఎంలుగా మారగా మరికొందరికి మాత్రం ఉపాధిని చూపి స్తున్నాయి. మునిసిపాలిటీ ఆదాయానికి కోట్లల్లో గండిపడు తోంది. అద్దెదుకాణాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వాడుకలో ఉన్నాయి? ఎంతమంది లీజుదారులు దుకాణాలు నడుపుతు న్నారు? ఎంతమంది సబ్‌లీజుకు ఇచ్చారు? పురపాలికకు నెలనెల ఎంత వసూలవుతోంది? ఎంత బకాయి ఉందనే వివరాలు కొన్నేళ్లుగా అధికారుల దగ్గర సరైన లెక్కలు లేక పోవడం గమనార్హం. లెక్కలు కొలిక్కి వచ్చేలోపు సంబంధిత అధికారి బదిలీ కావడం. కొత్త అధికారి వచ్చి మళ్లీ లెక్కలు తీయడం పరిపాటిగా జరిగేది. ప్రభుత్వం మారడంతో ఎట్టకేలకు అధికారులు బకాయిల లెక్కలు తీసినట్లుగా స్పష్టమవుతోంది. పురపాలిక పరిధిలోని 258 అద్దెదుకాణా లకు రూ.23.93 కోట్ల ఆదాయం రావాల్సి ఉందని అధికారులు తేల్చారు. ఇందులో 61 దుకాణాలు వివిధ కారణాల వల్ల మనుగడలో లేవని ఇందులో కొన్నింటిపై కోర్టు కేసులుండగా, కొందరు సొంతంగా తాళాలు వేసుకున్నారని, కొన్ని దుకాణాలను అధికారులే మూసి వేశారని, ఈ దుకాణాలపై రూ.7.11 కోట్ల బకాయి ఉన్నట్లు చూపించారు. ఇవి పోను మిగతా దుకాణాలపై రూ.16.82 కోట్లు రావాల్సి ఉండగా అందులో ఈ ఏడాది రూ.1.23 కోట్లు వసూలు(7.36 శాతం) కాగా ఇంకా రూ.15.58 కోట్ల అద్దె వసూలు కావాల్సి ఉం ది. వీటిని బట్టే అద్దె వసూలులో మునిసిపల్‌ అధికారులు ఎంత మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థమవుతోంది. కొన్ని దుకాణాల అద్దె ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. రూ.50 లక్షల నుంచి కోటి వరకు పెండింగ్‌ ఉన్న దుకాణాలున్నాయి.కొందరు అధికారులు గతంలో అద్దె వసూలు కు వెళ్లి మామూళ్లకు ఆశపడి అద్దె వసూలు చేయకుండా వచ్చేవారు. మరికొందరు డబ్బులు తీసుకుని నకిలీ రశీదులు ఇచ్చిన సందర్బాలున్నాయి. ప్రస్తుతం మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో బకాయిలు వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకువస్తుండటంతో యంత్రాంగం నెమ్మదిగా కదిలి వారికి నోటీసులు ఇవ్వడం, సీజ్‌ చేయడం చేస్తున్నారు.

బహిరంగ వేలం.. పైరవీలతో భారం

గడియారం చౌరస్తా, మార్కెట్‌రోడ్‌లో ఉన్న 53 దుకాణాల 30 ఏళ్ల లీజు గడువు ముగిసిపోయింది. 2015-16లో అప్పటి కమిషనర్‌ దేవ్‌సింగ్‌నాయక్‌ ఈ దుకాణాలకు బహిరంగవేలం నిర్వహించారు. సిట్టింగ్‌ వ్యాపారులే పోటాపోటిగా వేలం పాడి తిరిగి వాటిని దక్కించుకున్నారు. అప్పటిదాకా నెలకు రూ.7 వేల నుంచి రూ.12 వేల వరకు ఉన్న అద్దె బహిరంగ వేలంలో రూ.50-70 వేలు.. ఆపై లక్ష వరకు వేలం పాడి దుకాణాలను దక్కించుకున్నారు. కానీ నెలనెల అద్దె ఎలా చెల్లించాలని పైరవీలు సాగించారు. ఎట్టకేలకు స్థానిక నాయకుల ద్వారా అప్పటి పురపాలిక మంత్రి కేటీఆర్‌ చేత తాత్కాలికంగా నిలుపుదల చేయించుకున్నారు. అప్పటిదాకా చెల్లించిన అద్దెకు 300 శాతం పెంచి చెల్లించాలంటూ ఎండార్స్‌మెంట్‌ ఇచ్చారు. అంటే రూ.7 వేలు ఉంటే రూ.21 వేలు చెల్లించాలి. ఇలా ఇప్పటివరకు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే వేలంపాటు పాడిన మొత్తం మాత్రం వారి పేరిట డ్యూ చూయిస్తూ రావడం వల్ల అది కాస్త కోట్లకు చేరింది. ఇప్పుడు వీరిపై ఉన్న బకాయి మొత్తం చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డిని ఆశ్రయించారు. అధికారులతో చర్చించిన ఆయన ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో పరిశీలిద్దామని కొంత సమయం ఇవ్వాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా దుకాణాలను లీజు తీసుకున్న వారు మరికొందరికి సబ్‌లీజుకు ఇచ్చి గలీజు దందాకు తెరతీశారు. పలు దుకాణాలపై అసలు లీజుదారులెవరో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇతరులకు అధిక మొత్తంలో అద్దెకు ఇచ్చి ఉపాధి పొందుతున్నారు. అద్దెల రూపంలోనే రూ.16 కోట్లు బకాయి ఉంటే పురపాలిక పురోగతి ఎలా సాధ్యమవుతుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 08 , 2024 | 11:48 PM