Share News

జేఎన్‌టీయూ చెంత.. సమస్యల చింత

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:17 PM

: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది వనపర్తి జేఎన్‌టీయూ (జవహర్‌ లాల్‌ నెహ్రూ టెక్నాలిజికల్‌ యూనివర్సిటీ) పరిస్థితి. ఉన్నత విద్యా సంస్థలో సీటు దక్కిందని సంతోషపడాలో.. లేక ఎలాంటి సౌకర్యాలు లేని చోట సీటు వచ్చిందని బాధపడాలో తెలియని స్థితిలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు.

జేఎన్‌టీయూ చెంత.. సమస్యల చింత
జేఎన్‌టీయూ తరగతులు నిర్వహిస్తున్న పీయూ పీజీ సెంటర్‌

మూడో బ్యాచ్‌ ప్రారంభమైనా శాశ్వత భవనం లేక ఇక్కట్లు

అరకొర వసతుల మధ్య పీయూ పీజీ సెంటర్‌లో చదువులు

వసతి గృహాల్లో ఇరుకు గదులు, అధ్వానంగా భోజనం

900 మంది విద్యార్థులకు గాను 300 మందికే హాస్టల్‌ వసతి

ల్యాబ్‌లు, వర్క్‌షాపులు లేక ప్రాక్టికల్స్‌కు ఇబ్బందులు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది వనపర్తి జేఎన్‌టీయూ (జవహర్‌ లాల్‌ నెహ్రూ టెక్నాలిజికల్‌ యూనివర్సిటీ) పరిస్థితి. ఉన్నత విద్యా సంస్థలో సీటు దక్కిందని సంతోషపడాలో.. లేక ఎలాంటి సౌకర్యాలు లేని చోట సీటు వచ్చిందని బాధపడాలో తెలియని స్థితిలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. తరగతులు సరిపోక, ల్యాబులు.. వర్క్‌షాప్‌లు లేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌ వసతి అందరికీ లేకపోగా, ఉన్నవారికి వసతుల నుంచి ఆహారం వరకు అధ్వానంగా మారింది. రెండేళ్ల నుంచి ఇబ్బందుల నడుమ చదువులు నెట్టుకొస్తున్న స్టూడెంట్స్‌.. భరించలేక మంగళవారం రోడ్డెక్కారు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డును దిగ్బంధించి దాదాపు ఐదారు గంటలపాటు బైఠాయించారు. అయితే ఇంకా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే చాలా ఏళ్లు ఆగక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. వసతుల లేకపోవడం వల్ల ఇంజనీరింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నిండటం లేదని తెలుస్తోంది. వాస్తవానికి జేఎన్‌టీయూలోని ఏదైనా బ్రాంచ్‌లో సీటు వచ్చిదంటే విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. ఇందుకు ఆ స్థాయిలో విద్య అందడమే కారణం. కానీ వనపర్తి ఇంజనీరింగ్‌ కాలేజీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఉన్నత విద్యాశాఖ, జేఎన్‌టీయూ అధికారులు దృష్టి సారించకపోతే యూనివర్సిటీకి చెడ్డపేరు రావడం ఖాయంగానే కనిపిస్తోంది.

శాశ్వత భవనంపై దృష్టి ఏదీ

వనపర్తికి జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీకి 2022 జనవరి మూడో తేదీన జీవోఎంఎస్‌ 1 ద్వారా మంజూరైంది. శాశ్వత భవన నిర్మాణాలకు సమయం పట్టే అవకాశం ఉన్నందున పాలమూరు యూనివర్సిటికీ సంబంధించిన పీజీ సెంటర్‌లో తాత్కాలికంగా అదే సంవత్సరం నుంచి అడ్మిషన్లు తీసుకుని, తరగతులు ప్రారంభించారు. ఈ కాలేజీలో మొత్తం ఐదు కోర్సులు ఉన్నాయి. సివిల్‌(సీఈ), మెకానికల్‌(ఎంఈ), ఎలక్ర్టానిక్స్‌్క్షకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఈసీఈ), కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌(సీఎస్‌ఈ), కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌(ఏఐ, ఎంల్‌ (సీఎస్‌ఎం)) కోర్సులకుగాను 60 సీట్ల చొప్పున మొత్తం 300 సీట్లను భర్తీ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మూడో సంవత్సరం అడ్మిషన్లు పూర్తికాగా.. 900 మంది విద్యార్థులకు గాను 720 మంది మాత్రమే ఉన్నారు. అయితే శాశ్వత భవనం కోసం వనపర్తి శివారులోని మర్రికుంటలో 45 ఎకరాల స్థలం కేటాయించారు. శాశ్వత భవనం, హాస్టల్‌ భవనాల నిర్మాణం కోసం గత ప్రభుత్వంలోని మంత్రులు శంకుస్థాపన చేశారు. ఎలాంటి బడ్జెట్‌ అప్రూవల్‌ లేకపోవడంతో ఇప్పటివరకు భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. దీంతో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుత పీజీ కాలేజీలో కేవలం ఐదు గదులు మాత్రమే కేటాయించారు. మొత్తం ఐదు బ్రాంచులు, మూడు సంవత్సరాలకు కలిపి 720 మంది ఉన్నారు. తరగతులకు ఇబ్బంది అవుతుండటంతో.. అక్కడికి దగ్గర్లోనే ఒక భవనాన్ని నెలకు రూ.70 వేలకు అద్దెకు తీసుకున్నారు. అలాగే ఇంజనీరింగ్‌ అంటే ల్యాబులు, వర్క్‌షాపులు కచ్చితంగా ఉండాలి. కాలేజీ అధికారుల ప్రకారం మొదటి, రెండో సంవత్సరం వరకు ల్యాబులు, వర్క్‌షాపులు ఉన్నాయి. మూడో సంవత్సరం వారికి లేవు. ఉన్న వాటిల్లో కూడా కావాల్సిన వసతులు లేవని, అందువల్ల ప్రాక్టికల్స్‌ చేయడం సాధ్యం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అటు శాశ్వత భవనం, ఇటు ల్యాబులు లేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.

హాస్టళ్లు, ఆహారం అధ్వాన్నమే

ఇంజనీరింగ్‌ కాలేజీతోపాటే ప్రారంభమైన మెడికల్‌ కాలేజీకి ఇప్పటికే హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. శాశ్వత భవనాలు కూడా కొలిక్కి వస్తున్నాయి. ల్యాబులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అక్కడ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం అసలు అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదు. అలాగే ఈ కళాశాలలో సీటు దక్కించుకున్న విద్యార్థులకు కచ్చితంగా హాస్టల్‌ వసతి కల్పించాలి. సుదూర ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్‌ ద్వారా ఇక్కడ సీట్లు పొందుతారు కాబట్టి, వారికి అవి అత్యవసరం. ప్రస్తుతం ఉన్న 720 మంది విద్యార్థుల్లో కేవలం 300 మంది విద్యార్థులకు మాత్రమే హాస్టల్‌ వసతి కల్పిస్తున్నారు. బాయ్స్‌ హాస్టల్‌ను రెండు చోట్ల ఏర్పాటు చేశారు. ఒక హాస్టల్‌ను జిమ్‌ భవనంలో ఉంచారు. ఒక్కో గదికి నలుగురి నుంచి ఐదుగురు విద్యార్థులను ఉంచామని అధికారులు చెబుతున్నప్పటికీ.. అంతకంటే ఎక్కువ మందిని ఉంచుతుండటంతో ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. గర్ల్స్‌ హాస్టల్‌ను గతంలో ప్రైవేటు ఆస్పత్రికి వినియోగించుకున్న భవనంలో ఏర్పాటు చేశారు. కనీసం దాన్ని హాస్టల్‌కు అనుగుణంగా మార్పులు చేయకపోవడం గమనార్హం. అక్కడ దుర్వాసన, రక్తం మరకలు వంటి వాటితో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మెస్‌ విషయానికి వస్తే నెలకు రూ.2,500 చొప్పున విద్యార్థులే చెల్లిస్తున్నప్పటికీ.. నాణ్యమైన భోజనం అందడం లేదు. పప్పులో వెంట్రుకలు, సాంబార్లో బొద్దింకలు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లలో బాత్‌రూంలు సరిగా లేవని, ఉన్నవి కంపు కొడుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. మెడికల్‌ కాలేజీపై ఉన్న శ్రద్ధ తమపై లేదని, తమకూ అన్ని సౌకర్యాలు కావాలని కోరుతున్నారు.

హాస్టల్‌ను మార్చాలి

అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని వేరే భవనంలోకి మార్చాలి. గతంలో అక్కడ ఆస్పత్రిని నిర్వహించారు. హాస్టల్‌కు అప్పగించేటప్పుడు కనీసం శుభ్రపర్చకుండా.. పెయింట్లు వేయకుండా అలాగే ఇచ్చారు. అక్కడ కంపు భరించలేకపోతున్నాం. గోడలపై రక్తపు మరకలు ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీస వసతుల కోసం మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.

- హారిక, సీఎస్‌ఈ మొదటి సంవత్సరం

బాత్‌రూంలు కూడా సరిగా లేవు

వసతి గృహాల్లో బాత్‌రూంలు కూడా సరిగా లేవు. కంపుకొడుతున్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీ అంటే గొప్పగా ఉండాలి. భోజనం నాణ్యంగా ఉండి, వసతి సరిగా ఉంటేనే చదవాలనిపిస్తుంది. సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా చలనం లేకుండా పోయింది. వచ్చే సంవత్సరం ఎవరైనా వనపర్తి ఇంజనీరింగ్‌ కాలేజీకి వెళ్తున్నామంటే నేను వెళొద్దని చెప్తాను.

- దినేష్‌, సీఎస్‌ఈ రెండో సంవత్సరం

రెండేళ్లుగా భరిస్తున్నాం

ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రారంభమై ప్రస్తుతం మూడో బ్యాచ్‌ విద్యార్థులు వచ్చారు. మేము రెండు సంవత్సరాలుగా తరగతులను కష్టాల మధ్య కొనసాగిస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా కొద్దీ మాకు ఇబ్బందులు కూడా రెట్టింపవుతున్నాయి. కాలేజీలో తరగతుల నుంచి మొదలుకుని ల్యాబుల వరకు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. హాస్టల్‌లలో చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి.

- హిందు, సీఎ్‌సఈ మూడో సంవత్సరం

ఆహారంలో వెంట్రుకలు

హాస్టల్‌లో నాణ్యమైన భోజనం అందించడం లేదు. భోజనం చేసేటప్పుడు పప్పు, సాంబార్‌లో వెంట్రుకలు, బొద్దింకలు కనిపిస్తున్నాయి. వనపర్తిలో యూనివర్సిటీ కాలేజీ గొప్పగా ఉంటుందని వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే అవేమీ కనిపించడం లేదు. ఆహారం సరిగా లేక అనారోగ్యానికి గురవుతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా సమస్యలు తీరడం లేదు.

- అరవింద్‌, సీఎ్‌సఈ, రెండో సంవత్సరం

Updated Date - Oct 23 , 2024 | 11:17 PM