Share News

యువశక్తి.. సేవా స్ఫూర్తి

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:33 PM

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన కాగితాల మధు ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశా డు.

యువశక్తి.. సేవా స్ఫూర్తి
ఖిల్లాఘణపురంలో యువశక్తి ఫౌండేషన్‌ ద్వారా రక్తదానం చేస్తున్న ప్రజాప్రతినిధులు (ఫైల్‌)

- 10 మంది సభ్యులతో ఫౌండేషన్‌ ఏర్పాటు

- ప్రస్తుతం నాలుగు వేల మంది సభ్యులు

- అవసరమైన వారికి రక్తం అందించడమే లక్ష్యం

- సామాజిక సేవలోనూ భాగస్వామ్యం

ఖిల్లాఘణపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన కాగితాల మధు ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశా డు. ఒక వైపు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్ని స్తూనే, స్వచ్ఛందంగా విద్యాబోధన చేస్తున్నాడు. కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తున్న సమయం.. 2021, మార్చి ఎనిమిది, అంతర్జాతీయ మహిళా దినో త్సవం రోజు హైదరాబాద్‌లో నిండు గర్భిణికి బి పాజిటివ్‌ రక్తం అవసరమైంది. కానీ సకాలంలో రక్తం లభించలేదు. దీంతో ఆమె జన్మనిచ్చిన శిశువు మృతి చెందింది. ఆ సమయంలో ఏదో పని మీద ఆసుపత్రికి వెళ్లిన కాగితాల మధు అక్కడే ఉన్నాడు. ఈ విషాద సంఘటన అతడి మనసును కలిచివేసింది. ‘తన కోసం చేసే పనులు తనతోనే అంతరించిపోతాయి.. పది మంది కోసం చేసే పనులు పది కాలాల పాటు నిలిచిపోతాయి’ అనే స్వామి వివేకానంద బోధనను స్ఫూర్తిగా తీసుకున్నాడు. యువతలో సేవా దృక్ఫథాన్ని పెంచడంతో పాటు, సమాజంలో మార్పు రావాలనే లక్ష్యంతో యువశక్తి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు.

10 మంది సభ్యులతో ప్రారంభం

మొదట 10 మంది సభ్యులతో యువశక్తి ఫౌం డేషన్‌ ప్రారంభం అయ్యింది. వాట్సాప్‌ గ్రూప్‌ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన నాలుగు వేల మంది సంస్థలో సభ్యులుగా చేరారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారు ఎంత దూరంలో ఉన్నా గ్రూప్‌ సభ్యులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 30 వేల మందికి పైగా రక్తదానం చేశారు. అలా రక్తదానం స్వీకరించిన వారి కుటుంబ సభ్యులు మరొకరికి రక్తం ఇచ్చేలా చైతన్య పరుస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌క్రాస్‌, చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులలో రక్తం నిల్వలు అందుబాటులో లేకపోతే యువశక్తి ఫౌండే షన్‌ ద్వారా సేవలు అందిస్తున్నారు. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా సమాచారం అందిన వెంటనే ఏ సమయం లోనైనా అందుబాటులో ఉన్న గ్రూప్‌ సభ్యులు అక్కడికి చేరుకొని రక్తదానం చేస్తున్నారు. సభ్యులు రక్తదాన శిబిరాల్లో చురుకుగా పాల్గొంటూ, ప్రజా ప్రతి నిధులు, అధికారులు సైతం రక్తదానం చేసేలా ప్రోత్స హిస్తున్నారు. అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేస్తున్నారు. ఎంబీబీఎస్‌, ఇంజనీరింగ్‌, ఉద్యోగాల కోసం శిక్షణ పొందేందుకు దాతల సహకారంతో ఆర్ధిక సాయం అందించి అండగా నిలుస్తున్నారు.

రక్తదానానికి సిద్ధంగా ఉన్నాం

రాష్ట్రంలో ఎక్కడైనా రోగులకు రక్తం లభించకపోతే రాత్రి పగలు తేడా లేకుండా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రక్తం అందిస్తున్నాం. ఇప్పటి వరకు నేను 60 సార్లు రక్తదానం చేశాను. యువతీ యువకులను చైతన్య పరిచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. సకాలంలో రక్తం అందక ఒక్కరు కూడా చనిపోవద్దనే దృఢ సంకల్పంతో పని చేస్తున్నాం.

- కాగితాల మధు, యువశక్తి ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

70 సార్లు రక్తదానం

ధాన్యం ప్రవీణ్‌, వనపర్తి : గర్భిణులు, క్యాన్సర్‌, తలసేమియా, కిడ్నీ వ్యాధి బాధితులకు రక్తం చాలా అవసరం అవుతుంది. వారి కోసం ప్రతీ మూడు నెలలకు ఒకసారి చొప్పున, ఇప్పటి వరకు 70 సార్లు రక్తదానం చేశాను. నా కుమారుడు గౌతమ్‌ కూడా రెండు సార్లు రక్తదానం చేశాడు. రక్తదానంతో ప్రాణదానం చేయడం సంతృప్తి కలిగించింది.

Updated Date - Nov 11 , 2024 | 11:33 PM