Share News

TPCC: టీపీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్.. ఏ క్షణమైనా ప్రకటన..?

ABN , Publish Date - Aug 26 , 2024 | 11:00 AM

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరు.. ఎవరు.. అంటూ గత కొన్ని రోజులుగా మీడియా, జనాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఉండేదే. అంత త్వరగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎవరనేది తేలదు. ఎందుకంటే ఇక్కడ సీనియర్లు ఎక్కువ.

TPCC: టీపీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్.. ఏ క్షణమైనా ప్రకటన..?

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరు.. ఎవరు.. అంటూ గత కొన్ని రోజులుగా మీడియా, జనాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఉండేదే. అంత త్వరగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎవరనేది తేలదు. ఎందుకంటే ఇక్కడ సీనియర్లు ఎక్కువ. అందుకే రోజుకో పేరు తెరపైకి వస్తూ ఉంటుంది. ఈయన కన్ఫర్మ్ అనుకునే లోపు మరో పేరు వస్తుంది. అందుకే అదొక అంతులేని కథలా సాగుతూనే ఉంటుంది. అయితే ఎక్కడో ఒకచోట మాత్రం శుభంకార్డు పడాలి కదా.. పడిపోయింది. తాజాగా ఒక పేరు దగ్గర ఆగిపోయింది. ఆ పేరే బొమ్మ మహేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఈసారి ఈయనకే టీపీసీసీ పగ్గాలను అధిష్టానం అప్పగించబోతోందని పక్కా సమాచారం. ఇక ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఇవాళే ప్రకటన రానుందని సమాచారం.


అసలు ఎవరీ మహేష్ గౌడ్?

బొమ్మ మహేష్ గౌడ్.. పేరులోనే సామాజిక వర్గం ఏంటో తెలుస్తోంది కాబట్టి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. తొలిసారిగా 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ గౌడ్ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.


కష్టానికి ప్రతిఫలం..

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మహేష్ గౌడ్ ఫేట్ మారిపోయింది. ఈ ఏడాది జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌గా పదవిని అలంకరించబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీని ఏ తరుణంలోనూ వదిలిపెట్టలేదు. పైగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ఇంత కాలానికి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలా సామాజిక సమీకరణాలు అన్నీ మహేష్‌కు కలిసొచ్చినట్టుగా సమాచారం.

Updated Date - Aug 26 , 2024 | 11:00 AM