రేవంత్ నోరు కట్టేసిన అధిష్ఠానం
ABN , Publish Date - Sep 23 , 2024 | 04:42 AM
తెలంగాణలో ఎస్సీల వర్గీకరణకు సీఎం రేవంత్‌రెడ్డి అనుకూలంగా ఉన్నా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన నోరు కట్టేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
వర్గీకరణకు ఆయన సానుకూలమే కానీ.. హైకమాండ్ నో: మంద కృష్ణ మాదిగ
తెనాలి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎస్సీల వర్గీకరణకు సీఎం రేవంత్‌రెడ్డి అనుకూలంగా ఉన్నా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన నోరు కట్టేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. శనివారం రాత్రి మొదలైన సభ.. ఆదివారం తెల్లవారుజాము వరకు సాగింది. ఏపీలో వర్గీకరణ కచ్చితంగా అమలవుతుందని నమ్ముతున్నానని, తెలంగాణ, కర్ణాటకలోనే అమలుపై అనుమానాలు ఉన్నాయన్నారు. ‘ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని నాకు తెలుసు. కానీ మనలో కొందరు వైసీపీని నమ్మి నన్ను అనుమానించారు. మనల్ని గొర్రెల్ని చేసిన జగన్ కసాయిగా మారి వర్గీకరణను చంపేశారు’ అని అన్నారు. జగన్ మాదిగల ద్రోహి అని విమర్శించారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్, వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలూ సహకరించాయన్నారు.