Khammam: మాలలతో రేవంత్ కుమ్మక్కు: మందకృష్ణ
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:39 AM
మాలలతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కై ఎస్సీ వర్గీకరణ అమలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.
ఖమ్మంటౌన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మాలలతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కై ఎస్సీ వర్గీకరణ అమలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. దీని వల్ల మాదిగలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన మాదిగల ధర్మ యుద్ధ సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని ప్రకటించిన రేవంత్‌రెడ్డి, మాలలతో కుమ్మక్కై అమలుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
మాలలకు వ్యతిరేకంగా పని చేస్తే పదవి కోల్పోవలసి వస్తుందని ఆయన భయపడుతున్నారని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాల సామాజిక వర్గానికి చెందినవారు కావటమే దీనికి కారణమని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ వర్గీకరణను అమలు చేయకపోవటంతో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఈ నెల 30 వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ధర్మయుద్ధం సభలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే నెల 16న రథయాత్ర, డిసెంబరు 21న చలో హైదరాబాద్ ఉంటుందని తెలిపారు.