Share News

4 కిలోమీటర్లు.. 16 మూలమలుపులు

ABN , Publish Date - Aug 25 , 2024 | 11:21 PM

కొండాపూర్‌, ఆగస్టు 25: తేర్పోల్‌- కొండాపూర్‌కు వెళ్లే దారి మూలమలుపులతో ప్రమాదకరంగా ఉన్నది.

4 కిలోమీటర్లు.. 16 మూలమలుపులు
కొండాపూర్‌-తేర్పోల్‌ వెళ్లే రోడ్డులో ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు

ప్రమాదకరంగా తేర్పోల్‌-కొండాపూర్‌

దారి పొడవునా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు

కొండాపూర్‌, ఆగస్టు 25: తేర్పోల్‌- కొండాపూర్‌కు వెళ్లే దారి మూలమలుపులతో ప్రమాదకరంగా ఉన్నది. మండలానికి 24 గ్రామపంచాయతీలు ఉండగా.. 16 గ్రామాలకు తేర్పోల్‌-కొండాపూర్‌ ప్రధాన రోడ్డు అనుసంధానంగా ఉన్నది. తేర్పోల్‌ నుంచి మండల కేంద్రమైన కొండాపూర్‌కు వెళ్లేందుకు 4 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. అయితే దారి పొడవునా 16 మూలమలుపులు, రోడ్డుపైనే వెలసిన సర్కారు ముళ్ల చెట్లు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తాయి. ఎనిమిది గ్రామాలకు చెందిన ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన రోడ్డు. అలాగే మల్లేపల్లి శివారు పరిశ్రమల్లో పనిచేసేందుకు దాదాపు 8 గ్రామాల నుంచి కార్మికులు ఈ దారిగుండానే వెళ్తారు. అదేవిధంగా పంచాయతీలకు డిజిటల్‌ ఇండియా(ఆన్‌లైన్‌) కేబుల్స్‌ కోసం రోడ్డు అంచును తవ్వి మ్యాన్‌వల్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే నాలుగు కిలోమీటర్ల రోడ్డు మొత్తం పిచ్చిమొక్కలు, మూలమలుపులతో ఉన్నది. దీంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళన చెందుతూ ప్రయాణం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..

పరిపాలన అధికారులు గ్రామాలను పర్యవేక్షించాలంటే ఈ రోడ్డుపైనే ప్రయాణించాలి. రోజుకో, వారానికో ఏదో ఒకశాఖ అధికారి వెళ్తుంటారు. మూలమలుపులను చూసినా.. పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను తీర్చాలని కోరుతున్నారు.

Updated Date - Aug 25 , 2024 | 11:21 PM