Share News

71వేల మందికి.. రూ.728 కోట్లు

ABN , Publish Date - Jul 29 , 2024 | 11:42 PM

రెండో విడత రుణమాఫీని నేడు అమలు చేయడానికి ప్రభుత్వ యం త్రాంగం సన్నద్దమైంది. ఆ దిశగా ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు వచ్చాయి. నేటి మధ్యాహ్నం 12గంటల నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

71వేల మందికి.. రూ.728 కోట్లు

నేడే రెండో విడత రుణమాఫీ

రూ. లక్షన్నర వరకు రైతుల ఖాతాల్లో జమ

మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం

తొలి విడతలో ఉమ్మడి జిల్లాలో 1.70 లక్షల మందికి లబ్ధి

సొసైటీ రుణాలపై చిక్కుముడి

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూలై 29: రెండో విడత రుణమాఫీని నేడు అమలు చేయడానికి ప్రభుత్వ యం త్రాంగం సన్నద్దమైంది. ఆ దిశగా ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు వచ్చాయి. నేటి మధ్యాహ్నం 12గంటల నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. తొలి విడతగా రూ.లక్ష వరకు రుణాలు పొందిన రైతులకు మాఫీ జరిగింది. ప్రస్తుతం రూ.లక్షన్నర రుణాలను రెండో విడతగా మాఫీ చేయనున్నారు. ఇక చివరగా మూడో విడతలో రూ.2లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15వ తేదీలోపు తుది విడత పూర్తిచేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. తొలి విడత రుణమాఫీని ఈ నెల 18వ తేదీన అమలు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,70,205 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. వీరిలో ఎక్కువగా మూడెకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు, రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు రుణం తీసుకున్నవారు ఉన్నారు.

తొలి విడతలో రూ.902 కోట్లు

తొలి విడతగా ఉమ్మడి జిల్లాలోని రైతులకు రూ.902 కోట్ల రుణమాఫీ జరిగింది. 1,60,636 రైతు కుటుంబాలకు లబ్ది జరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక రుణమాఫీ జరిగిన తొలి రెండు నియోజకవర్గాలుగా సంగారెడ్డి జిల్లాలో అందోలు, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ నిలిచాయి. దుబ్బాక నాలుగో స్థానంలో నిలిచింది. నారాయణఖేడ్‌, నర్సాపూర్‌, మెదక్‌ నియోజకవర్గాల రైతులకూ రూ.90 కోట్ల చొప్పున నిధులు సమకూరాయి.

నేడు 71వేల మందికి..

నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండో విడతగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారికంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు సైతం బహిర్గతం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71వేల పైచిలుకు రైతులకు ప్రయోజనం కలగనున్నది. ఈ రైతుల్లో 5 ఎకరాల లోబడి ఉన్నవారే అధికం. కాగా తొలి విడతలో ఉన్నట్లుగానే ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను రుణమాఫీ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిసింది. వీరు పొందిన రుణాలతో ప్రభుత్వానికి సంబంఽధం లేదని తేల్చిచెప్పింది. అందుకే రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య కూడా భారీగానే తగ్గుతోంది.

‘సొసైటీ’ రైతులకు మాఫీ జరిగేనా?

ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యులైన రైతులు కొంతమంది ఎస్‌బీహెచ్‌ బ్రాంచ్‌లో రుణాలు పొందారు. సొసైటీల్లోనే వీరి డాక్యుమెంట్లను పరిశీలించి రుణాలు సొసైటీ నుంచి కాకుండా ఎస్‌బీహెచ్‌ నుంచి ఇచ్చారు. ఎస్‌బీహెచ్‌ బ్యాంకు తర్వాతి రోజుల్లో ఎస్‌బీఐలో విలీనమైంది. దీంతో తమకు అన్యాయం జరిగిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారం పీఏసీఎస్‌ సొసైటీ పరిధిలో 1,369 మంది రైతులకు రూ.4.25 కోట్ల రుణం మాఫీ కావాల్సి ఉన్నా కాలేదు. ఇదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని మల్కాపూర్‌, కొండాపూర్‌, నందికంది, నాగాపూర్‌ తదితర 16 సొసైటీల్లో ఈ పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోనూ సొసైటీ ఖాతాదారులకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. తొలివిడతలో మాఫీ జరగకపోవడంతో కనీసం రెండో విడతలోనైనా తమకు లబ్ది చేకూరుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 11:42 PM