Share News

ముదురుతున్న రగడ

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:58 PM

మాట వినలేదనో, ఇతర కారాణలేమిటో కాని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్నరాణి, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల మధ్య గత కొన్ని రోజులుగా నువ్వా..? నేనా..? అన్నట్లుగా రగడ మొదలైంది. తారస్థాయికి చేరిన మనస్పర్థల కారణంగా ఈనెల 10న జరిగిన మున్సిపల్‌ సాధారణ సమావేశంలో స్టేజీపై కూర్చున్న కమిషనర్‌ ప్రసన్నరాణి మిగతా అధికారులతో కలిసి స్టేజీ కింద కూర్చోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు పట్టుబట్టారు. దీంతో చేసేది లేక ఆమె అధికారులతో కలిసి కింద కూర్చు న్నారు.

ముదురుతున్న రగడ

కమిషనర్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

కౌన్సిల్‌లో కమిషనర్‌ను కింద కూర్చొబెట్టిన కౌన్సిలర్లు

సీడీఎంఎకు ప్రసన్నరాణి ఫిర్యాదు

విచారణ నిమిత్తం సిద్దిపేటకు మున్సిపల్‌ ఆర్‌డీ

సిద్దిపేట టౌన్‌, జూన్‌ 20 : మాట వినలేదనో, ఇతర కారాణలేమిటో కాని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్నరాణి, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల మధ్య గత కొన్ని రోజులుగా నువ్వా..? నేనా..? అన్నట్లుగా రగడ మొదలైంది. తారస్థాయికి చేరిన మనస్పర్థల కారణంగా ఈనెల 10న జరిగిన మున్సిపల్‌ సాధారణ సమావేశంలో స్టేజీపై కూర్చున్న కమిషనర్‌ ప్రసన్నరాణి మిగతా అధికారులతో కలిసి స్టేజీ కింద కూర్చోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు పట్టుబట్టారు. దీంతో చేసేది లేక ఆమె అధికారులతో కలిసి కింద కూర్చు న్నారు. కమిషనర్‌ ప్రసన్నరాణిని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అవమానించారంటూ కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మండిపడుతున్నారు.

సీడీఎంఎకు ఫిర్యాదు చేసిన ప్రసన్నరాణి

మున్సిపల్‌ సమావేశాల్లో కమిషనర్‌ వేదికపై కూర్చోవడం ప్రొటోకాల్‌. అయితే ఇటీవల జరిగిన సాధారణ సమావేశానికి ముందే ఎప్పటిలాగే స్టేజీపై కూర్చున్న తనను కింద కూర్చోవాలని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అవమానించారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ ఈ నెల 10న కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ (సీడీఎంఎ)కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కమిషనర్‌ ప్రసన్నరాణి బాధ్యతలు స్వీకరించారు. వచ్చిన నాలుగు నెలల్లోనే బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, కమిషనర్‌ మధ్య అంతలా ఏ వివాదం వల్ల రగడ మొదలైంది..?అనే విషయమై అటు మున్సిపల్‌ అధికారులు, ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

మున్సిపల్‌ ఆర్‌డీ విచారణ

మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదు మేరకు బుధవారం హైదరాబాద్‌ నుంచి రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. ఓ నివేదికను రూపొందించి సీడీఎంఏకు అందించనున్నట్లు మున్సిపల్‌ వర్గాల సమాచారం.

సెలవుపై వెళ్లిన కమిషనర్‌

కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు అవమానించారంటూ సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ ఈ నెల 11 నుంచి సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. కమిషనర్‌ ప్రసన్నరాణి సెలవుపై వెళ్లడంతో దాదాపు అన్ని ఫైల్స్‌ పెండింగ్‌లో పడ్డాయి. దీంతో కమిషనర్‌ను కావాలనే అవమానించారంటూ కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే విషయమై కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే ఉదతంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ కౌన్సిల్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతామని హెచ్చరిస్తున్నారు.

ఈ కమిషనర్‌ మాకొద్దు

కౌన్సిలర్లకు విలువ ఇవ్వడం లేదని, ఈ కమిషనర్‌ ప్రసన్నరాణి తమకు వద్దంటూ పలువురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి ఎదుట వెల్లడించినట్లు సమాచారం. బుధవారం వచ్చిన రీజనల్‌ డైరెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రజన్నరాణి వచ్చిన నాలుగు నెలల నుంచి ఏం చేశారో వివరించారు. కౌన్సిల్‌ సభ్యులకు విలువ ఇవ్వకపోవడంతో పాటు, కౌన్సిలర్లకు కమిషనర్‌ కార్యాలయానికి ఎందుకు వస్తున్నారని, మీకు ఇక్కడ ఏం పని ఉందని అన్నట్లు ఆర్‌డీకి వివరించినట్లు పలువురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు తెలిపారు. వార్డు కౌన్సిలర్లుగా వార్డు సమస్యలపై కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తే తమను చాలా ఇబ్బందులకు గురిచేశారని, వార్డు సమస్యలు చెప్పుకుందామంటే ఆమె చాంబర్‌కు రానిచ్చే వారు కాదని తెలిపారు. అందువల్లే తమకు విలువ ఇవ్వని కమిషనర్‌ను స్టేజీ మీద కూర్చోవద్దని, అధికారులతో కలిసి కూర్చోవాలని సూచించామని చెప్పారు. ఏది ఏమైనా కమిషనర్‌, కౌన్సిల్‌ మధ్య రగులుకున్న వివాదాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరించి పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని పట్టణవాసులు కోరుకుంటున్నారు.

అక్రమాలకు సహకరించలేదనే..

కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు చేస్తున్న అక్రమాలకు సహకారం అందించడం లేదనే మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్నరాణిని కౌన్సిల్‌ సమావేశంలో అవమానపరిచారని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సాకిబాల్‌లక్ష్మిఆనంద్‌, శ్రీదేవి బుచ్చిరెడ్డి, రియాజ్‌, ఏంఐఏం కౌన్సిలర్‌ అర్షద్‌ ఆరోపించారు. గురువారం సిద్దిపేటలో వారు మాట్లాడుతూ ఇటీవల మున్సిపల్‌ కమిషనర్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు స్టేజీ కింద కూర్చోబెట్టారని, కమిషనర్‌ ఫిర్యాదు మేరకు ఆర్‌డీ విచారణ జరిపారని తెలిపారు. విచారణకు ప్రతిపక్ష కౌన్సిలర్లను పిలవకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి కమిషనర్‌ను బదిలీ చేయాలని ఆర్‌డీకి బీఆర్‌ఎస్‌ వారు వినతిపత్రం అందజేశారని తెలిపారు. 20 ఏళ్లుగా సిద్దిపేట మున్సిపల్‌లో జరుగుతున్న అవినీతి అంతా..ఇంతా కాదని, త్వరలోనే విజిలెన్స్‌ అధికారుల ద్వారా విచారణ జరిపిస్తామన్నారు. ఈ విషయమై పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం కూడా ఇచ్చామని తెలిపారు. మందబలంతో బీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వభూముల్లో కాంపౌండ్‌లు నిర్మించి వాటికి ఇంటి నంబర్‌లు కేటాయించమని కమిషనర్‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. గతంలో పట్టణంలోని శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి రూ.40 లక్షలు కౌన్సిల్‌లో ఆమోదం చేశారని, కానీ ఎక్కడా కూడా కెమెరాలు బిగించలేదని ఆరోపించారు. ఆ డబ్బు ఎక్కడికి పోయిందని వారు ప్రశ్నించారు. కొన్నేళ్లుగా వారు ఆడిందే ఆటగా సాగిందని, ఇప్పుడు అలా సాగనివ్వబోమని త్వరలో ఇప్పుడున్న కౌన్సిల్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతామని తెలిపారు.

Updated Date - Jun 20 , 2024 | 11:58 PM