Share News

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:13 PM

నర్సాపూర్‌ ఆర్డీవో, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి జగదీశ్వర్‌రెడ్డి

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నర్సాపూర్‌ వద్ద చెక్‌పోస్టును తనిఖీ చేస్తున్న ఎన్నికల వ్యయ పరిశీలకుడు సునీల్‌కుమార్‌

నర్సాపూర్‌, ఏప్రిల్‌ 18: ఎన్నికల నిబంధనల మేరకే రాజకీయ పార్టీలు ప్రచారం చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని నర్సాపూర్‌ ఆర్డీవో, ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి జగదీశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం నర్సాపూర్‌ ఆర్డీవో కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓటర్లు 2,26,762 మంది ఉన్నారని, అందులో పురుషులు 1,10,037 ఉండగా మహిళలు 1,16,719 మంది ఉన్నారని తెలిపారు. ఇతరులు ఆరుగురు ఉన్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కంటే 4,790 మంది ఓటర్ల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో 307పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరపత్రాలు, పోస్టర్లు ప్రింట్‌ చేయిస్తే వాటిపై ఖచ్చితంగా ప్రచురణ కర్త పేరు, ఎన్ని ప్రింటు చేశారనే సమాచారం అభ్యర్థులు వాటిపై వేయించాలని సూచించారు. ర్యాలీలు, సభలు, ఇతర కార్యక్రమాలకు రెండు రోజుల ముందు సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. డబ్బు, మద్యం పంపిణీని కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందం నిరంతరం పర్యటిస్తూ నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తుందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తెలిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఆర్డీవో సూచించారు. మెదక్‌ పార్లమెంటు ఓట్ల లెక్కింపును జూన్‌ 4న నర్సాపూర్‌లోనే నిర్వహించనున్నట్లు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలో నర్సాపూర్‌, గజ్వేల్‌, మెదక్‌, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ఓట్లు లెక్కించనుండగా, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓట్లను గిరిజన గురుకులంలో లెక్కించనున్నట్లు తెలిపారు.

ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి

చెక్‌పోస్టుల వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు సునీల్‌కుమార్‌ రాజ్‌వాన్ష్‌ పేర్కొన్నారు. గురువారం నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని మల్లన్నగుడి, శభా్‌షపల్లి, మల్కాపూర్‌ ఎస్‌ఎ్‌సటీ చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. చెక్‌పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు 24గంటలు పని చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా చెక్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి స్థానిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయనవెంట ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్లు కమలాద్రి, శ్రీనివా్‌సచారి తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:13 PM