Share News

రైతులందరికీ రుణమాఫీ చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు

ABN , Publish Date - Aug 16 , 2024 | 11:14 PM

నంగునూరు, ఆగస్టు 16: కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.

రైతులందరికీ రుణమాఫీ చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు
ఎంపీ రఘునందన్‌రావు దంపతులను సన్మానిస్తున్న ఆలయ ధర్మకర్త, మంగువారి ధార్మిక సేవాసంస్థ వ్యవస్థాపకుడు మంగు రాధాకృష్ణరావు

నంగునూరు, ఆగస్టు 16: కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఆయన సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం సగం మంది రైతులకే మాఫీ చేసిందని, ప్రతీ గ్రామంలో రైతులు తమకు రుణమాఫీ కాలేదని చెప్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వందశాతం రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. షరతులు, నిబంధనలను విధించి 50శాతం మందికే రుణమాఫీ చేశారని విమర్శించారు. రుణమాఫీ విషయంలో క్షేత్రస్థాయిలో గ్రామపంచాయతీలకు వచ్చి రచ్చబండ వద్ద తెలుసుకోవాలన్నారు. గొప్పలు చెప్పుకోవడం కంటే గ్రామస్థాయిలోకి వెళ్లి రైతులందరికీ రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తుంగ కనకయ్య, వెంకట్రాంరెడ్డి, వెంకటరెడ్డి, తిరుపతిరావు, వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త, మంగు వారి ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మంగు రాధాకిషన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

వెంకటేశ్వరాలయంలో ఎంపీ పూజలు

సిద్దిపేట కల్చరల్‌, ఆగస్టు 16: సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వరాలయాన్ని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు శుక్రవారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎంపీ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఎంపీతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోడూరి నరేష్‌, బీజేపీ నాయకులు ఉన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 11:14 PM