Share News

అట్టహాసంగా ఐఐటీహెచ్‌ స్నాతకోత్సవం

ABN , Publish Date - Jul 20 , 2024 | 11:43 PM

కంది, జూలై 20: సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో 13వ స్నాతకోత్సవం శనివారం అట్టహసంగా జరిగింది. ఐఐటీహెచ్‌ క్యాంప్‌సలోని గ్రౌండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆడిటోరియంలో వైభవంగా కొనసాగింది.

అట్టహాసంగా ఐఐటీహెచ్‌ స్నాతకోత్సవం
ఐఐటీహెచ్‌ 13వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలను అందజేస్తున్న డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి

1,103 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం

నలుగురికి గోల్డ్‌ మెడల్స్‌

ఉత్సవంలో ఉట్టిపడిన స్వదేశీయత

పోచంపల్లి చేనేత వస్త్రాలతో అలరించిన విద్యార్థులు

ముఖ్యఅతిథిగా నీతి అయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం

కంది, జూలై 20: సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో 13వ స్నాతకోత్సవం శనివారం అట్టహసంగా జరిగింది. ఐఐటీహెచ్‌ క్యాంప్‌సలోని గ్రౌండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆడిటోరియంలో వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నీతి అయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బీవీ.ఆర్‌.సుబ్రహ్మణ్యం ఐఐటీహెచ్‌లో చదివిన బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీల్లోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 1,103 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. పట్టాలు పొందిన విద్యార్థుల్లో నలుగురు గోల్డ్‌మెడల్స్‌ సాధించారు. స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తమ పిల్లలు ఐఐటీ డిగ్రీలు తీసుకున్న సందర్భంగా ప్రత్యక్షంగా తిలకించారు. నీతి అయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బీవీ.ఆర్‌.సుబ్రహ్మణ్యం విద్యార్థులకు సందేశాన్నిచ్చారు. ఐఐటీహెచ్‌ జపాన్‌ సహకారంతో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టిందని ఆయన తెలిపారు. 5జీ, 6జీ టెక్నాలజీతో పాటు పలు రంగాల పరిశోధనల్లో ఐఐటీ-హెచ్‌ కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. కొత్త ఆలోచనను, వినూత్న పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు పలు వైవిధ్యమైన అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ప్రపంచంలో భారతదేశం అద్భుత పురోగతి సాధిస్తున్నదని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడంలో యువశాస్త్రవేత్తలు కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. స్నాతకోత్సవం సందర్భంగా ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి సందేశాన్ని, సంస్థ సాధించిన ప్రగతిని, పరిశోధనల గురించి వివరించారు. అనంతరం ఐఐటీహెచ్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఐఐటీహెచ్‌ ప్రారంభించి దశాబ్దకాలంగా ఆకాశమే హద్దుగా ఎదిగిన తీరును వివరించారు. ఇంటర్‌ డిసిప్లీనరీలో ఇండస్ట్రీ ఓరియంటెడ్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా తొలిసారిగా గ్రాడ్యుయేట్‌ బ్యాచ్‌ పట్టాలు పొందడం హర్షణీయమన్నారు. దేశం గర్వించేలా ఐఐటీహెచ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలుఉన్నాయని ఆయన కొనియాడారు. ఐఐటీహెచ్‌లో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో శాస్త్రవేత్తలుగా పేరే ప్రఖ్యాతలు గడిస్తున్నారని వెల్లడించారు. ఐఐటీహెచ్‌ విద్యార్థులు రేపటి తరానికి మార్గదర్శకులుగా ఉండాలని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఐఐటీహెచ్‌ నెంబర్‌వన్‌ స్థానంలో నిలవడం ఖాయమన్నారు. గతేడాది నుంచి ఐఐటీహెచ్‌లో ప్రవేశపెట్టిన మూడు కొత్త కోర్సులకు పట్టాలు ప్రదానం చేశారు. అందులో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, ఆన్‌లైన్‌ ఎంటెక్‌ ప్రోగామ్‌లకు తొలిసారిగా గ్రాడ్యుయేట్‌ బ్యాచ్‌ పట్టాలు పొందడం హర్షణీయమన్నారు. ఐఐటీహెచ్‌ స్థాపించిన 16 ఏళ్ల నుంచి ఇన్వెంటింగ్‌, ఇన్నోవేటింగ్‌ టెక్నాలజీ ఫర్‌ హ్యుమానిటీతో దూసుకుపోదందని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి అన్నారు.

సంప్రదాయ దుస్తుల్లో..

స్నాతకోత్సవానికి విద్యార్థులు, ప్రొపెసర్ల బృందం పోచంపల్లి చేనేత వస్త్రాలతో హాజరవ్వడంతో స్వదేశీయత ఉట్టిపడింది. ఇప్పటివరకు ఐఐటీహెచ్‌లో నిర్వహించిన ప్రతీ స్నాతకోత్సవానికి పోచంపల్లి చేనేత వస్త్రాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఐఐటీహెచ్‌ లోగో ముద్రించిన ఎరుపు, నారింజ, ఊదా, ఆకుపచ్చ, నీలం రంగు స్కార్ప్‌లతో విద్యార్థులు ఖద్దరు లాల్చి, ఫైజామాలు ధరించగా, విద్యార్థినులు సంప్రదాయకంగా చేనేత చీరకట్టుతో చూపరులను ఆకట్టుకున్నారు.

అంబరాన్నంటిన సంబరాలు

ప్రతిష్ఠాత్మకంగా ఐఐటీహెచ్‌ నుంచి ఇంజనీరింగ్‌ పట్టాలు పొందిన విద్యార్థులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. పట్టాలు స్వీరించిన అనంతరం ముఖ్యఅతిఽథి, ప్రొఫెసర్లతో గ్రూపు ఫొటోలు తీసుకున్నారు. తాము అందుకున్న పట్టాలు చూపుతూ, స్కార్ప్‌లను గాల్లో ఎగురవేస్తూ కేరింతలు కొట్టారు. పట్టాలు పొందిన ఆనంద క్షణాలను తమ తల్లిదండ్రులతో కలిసి సెల్‌ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ సంబరపడ్డారు. దీంతో ఐఐటీహెచ్‌ ప్రాంగణమంతా విద్యార్థుల కేరింతలతో మార్మోగింది.

వైభవంగా గీతం స్నాతకోత్సవం

హాజరైన బార్క్లేస్‌ బ్యాంక్‌ పూర్వ సీఈవో రామ్‌ గోపాల్‌

పటాన్‌చెరు రూరల్‌, జూలై 20: రుద్రారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో శనివారం 15వ పట్టభద్రుల దినోత్సవం (స్నాతకోత్సవం) శనివారం వైభవంగా నిర్వహించారు. గీతం ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ గౌతమరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బార్క్లేస్‌ బ్యాంక్‌ ఇండియా పూర్వ సీఈవో రామ్‌ గోపాల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి 2023-24 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, ఫార్మసీ, హ్యుమానిటీస్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సులు పూర్తిచేసిన 1,490 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ప్రత్యక్షంగా 1,325 మంది, పరోక్షంగా (ఇన్‌ ఆబ్‌సెన్సియా) 69 మంది పట్టభద్రులకు డిగ్రీలను, 23 మంది ప్రతిభావంతులకు బంగారు పతకాలను అందజేశారు. ఈసీఈ విభాగంతో పాటు బీటెక్‌ టాపర్‌గా నిలిచిన కె.కీర్తి గీతం అధ్యక్షుడి పేరిట నెలకొల్పిన రెండు బంగారు పతకాలను అందుకోగా, పీజీ బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌గా ఎంబీఏ విద్యార్థి శివకుమార్‌ శివాంజలి, యూజీ బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌గా బీఎస్సీ విద్యార్థిని వర్ష మెథైలి నిమ్మకాయల బంగారు పతకాలను అందుకున్నారు. పట్టభద్రులంతా తెల్లని దుస్తులు, ఎర్రని కండువాలతో వచ్చి భారతీయతను చాటారు. బంగారు పతక విజేతలు, పట్టభద్రులు పలువురు గీతమ్‌తో తమకున్న అనుబంధం, అక్కడ ఎదిగిన తీరు, విద్యనభ్యసించేటప్పటి పలు మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. పండుగ వాతావరణంలో గీతం 15వ పట్టభద్రుల దినోత్సవం ముగిసింది.

Updated Date - Jul 20 , 2024 | 11:43 PM