Share News

బోరుమంటున్న రైతులు

ABN , Publish Date - Aug 10 , 2024 | 11:09 PM

సాగునీటి కోసం మద్దూరు మండలం ధర్మారం గ్రామరైతులు రూ.లక్షలు వెచ్చించి చేసిన వారి భగీరథ ప్రయత్నం ఫలించలేదు. సాగునే నమ్ముకున్న వారు అప్పులు చేసి బోర్లు వేసినా చుక్కనీరు రాకపోవడంతో దిక్కుతోచకున్నారు.

బోరుమంటున్న రైతులు
ధర్మారంలోని ఓ రైతు పొలంలో నీరు పడకపోవడంతో పూడ్చిన బోరు

జూలైలో 40 బోర్లు వేయించిన అన్నదాతలు

కేవలం రెండు బోర్లలో అంతంత మాత్రమే నీటి లభ్యత

ఫలించని భగీరథ ప్రయత్నం

సాగునీటి కోసం ధర్మారం రైతుల తిప్పలు

లద్నూరు రిజర్వాయర్‌ నింపి నీరందించాలని వేడుకోలు

మద్దూరు, ఆగస్టు 10: సాగునీటి కోసం మద్దూరు మండలం ధర్మారం గ్రామరైతులు రూ.లక్షలు వెచ్చించి చేసిన వారి భగీరథ ప్రయత్నం ఫలించలేదు. సాగునే నమ్ముకున్న వారు అప్పులు చేసి బోర్లు వేసినా చుక్కనీరు రాకపోవడంతో దిక్కుతోచకున్నారు. కేవలం 820 ఎకరాలు మాత్రమే సాగయ్యే ఆ గ్రామంలో ఒక్కనెలలోనే ఏకంగా 40 బోర్లు వేశారు. అందులో కేవలం రెండు బోర్ల నుంచి మాత్రమే నీరు వస్తుండడంతో ఒకటి, రెండు మళ్లలో సాగు చేస్తున్నారు.

ధర్మారంలో 820 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. 356 మంది రైతులు వివిధ పంటల్ని సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 374 ఎకరాల్లో వరి, 302 ఎకరాల్లో పత్తి, 12 ఎకరాల్లో మొక్కజొన్న, 24 ఎకరాల్లో కంది, 3 ఎకరాల్లో కూరగాయ పంటల్ని సాగు చేస్తున్నారు. లద్నూరు గ్రామంలోని రిజర్వాయర్‌ నుంచి ధర్మారం మీదుగా కాలువ నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో లద్నూర్‌లోని రిజర్వాయర్‌లోకి వదిలిన దేవాదుల నీటిని పారించుకుని రైతులు గట్టెక్కారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయకపోవడంతో బోసిపోయింది. కాలువల్లో తుంగ మొలిచి వెక్కిరిస్తోంది. కాలువ పక్కన భూములు ఉన్న రైతులు బోర్లు వేసినా చుక్కనీటి జాడ లేదు. గత నెలలో సుమారు 15 మంది రైతులు దాదాపు 40 బోర్లు వేసి లక్షల్లో అప్పుల పాలయ్యారు.కొద్దోగొప్పో పోస్తున్న బోర్లతో ఒకటి రెండు మడుల్లో వరి సాగుచేస్తున్నారు. కాలువనీళ్లే ప్రధాన నీటి వనరుగా మారడంతో భగీరథ ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో బోరుమంటున్నారు. బోర్లు వేయించడానికి చేసిన అప్పులు తీరే మార్గం లేక ఆవేదన చెందుతున్నారు. లద్నూర్‌ రిజర్వాయర్‌ నింపి నీటిని అందించాలని వారు కోరుతున్నారు.

5 బోర్లు వేసినా చుక్కనీరు రాలేదు

- గుడిసె కిష్టయ్య, రైతు, ధర్మారం

నాకు 5 ఎకరాల భూమి ఉంది. గత సంవత్సరం రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. కాలువ పారడంతో పొలం అచ్చుకట్టి నీళ్లు పారించుకుని పంటసాగు చేశా. దేవుడి దయతో బయటపడ్డా. ప్రస్తుతం కాలువ పారడం లేదు. భూమిని పడావుగా వదిలేయలేక ఆశకొద్దీ రూ.1.80 లక్షలు అప్పు చేసి 5 బోర్లు వేసినా నీటిజాడ లేకుండా పోయింది. దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కాలువపారితేనే రందిపోతది.

కాలువ ద్వారా నీరు అందించాలి

- పల్లపు అఖిల్‌, రైతు, ధర్మారం

కాలువ ద్వారా నీరు అందిస్తేనే ఎవుసం సాగయ్యే పరిస్థితి. గత సంత్సరంలో వేసిన బోరు గ్యాప్‌ ఇస్తూ పోస్తుంది. ఈ సంవత్సరం వేసిన మూడు బోర్లలో చుక్కనీరు పడలేదు. రూ.లక్ష మట్టిలో పోసినట్టైంది. గత ప్రభుత్వంలో లద్నూరు రిజర్వాయర్‌ నింపి కాలువ ద్వారా నీళ్లందించారు. ఈ సారి కూడా రిజర్వాయర్‌ నింపి మా భూములు సాగయ్యేలా చూడాలి..

Updated Date - Aug 10 , 2024 | 11:09 PM