పర్యాటకంపై చిగురిస్తున్న ఆశలు
ABN , Publish Date - Jul 22 , 2024 | 11:59 PM
హుస్నాబాద్, జూలై 22: చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చిక బయళ్లు.. సహజ సిద్ధమైన వన సంపద.. మధ్యమధ్యలో సెలయేర్లు.. గుట్టల మధ్యలో సరస్సు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. స్వేచ్ఛగా విహరించే జంతు జాలం.. ఈ ప్రదేశాన్ని చూస్తే ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది.
మహా సముద్రం గండి రిజర్వాయర్‌పై మంత్రి ప్రత్యేక దృష్టి
ఇటీవల అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సందర్శన
ప్రాచీన నాగరికతకు పుట్టినిల్లు ఇక్కడి బయన్న గుట్టలు
గుట్టపైన ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయాలు
ఈ ప్రదేశాన్ని చూసి సంతోషపడిన మాజీ సీఎం కేసీఆర్
హుస్నాబాద్, జూలై 22: చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చిక బయళ్లు.. సహజ సిద్ధమైన వన సంపద.. మధ్యమధ్యలో సెలయేర్లు.. గుట్టల మధ్యలో సరస్సు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. స్వేచ్ఛగా విహరించే జంతు జాలం.. ఈ ప్రదేశాన్ని చూస్తే ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ ప్రకృతి సౌందర్యం ఒక్కటే కాదు.. ఆది మానవుని అవశేశాలు..సర్వాయి పాపన్న నిర్మించిన కట్టడాలు.. ప్రాచీన నాగరికతకు అద్దంపట్టే సాజీవ సాక్ష్యాలు ఇక్కడ దర్శనమిస్తాయి.. ఇది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మాపూర్ మహాసముద్రం గండి రిజర్వాయర్ బయ్యన్న గుట్టల్లో దాగి ఉన్న ప్రాచీన సంపద. దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రదేశాన్ని చూసి ఆకర్షితులయ్యారు. ఇది పర్యాటక కేందంగ్రా విరాజిల్లుతుందని కితాబుఇచ్చారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇటీవల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అందులో భాగంగా ఇటీవల ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఈ విషయంపై అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ మూడురోజుల క్రితం మహాసముద్రం రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారుతుందని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ప్రాచీన నాగరికతకు సాక్ష్యాలు
ఉమ్మాపూర్ గ్రామ శివారులో ఉన్న మహాసముద్రం గండికి పక్కనే బయ్యన్న గుట్టల్లో సర్వాయి పాపన్న రాతిగోడ నిర్మించారు. ఈ ప్రాంతంలో చుట్టూ గుట్టలు.. ఈ గుట్టల మధ్య మహాసముద్రం గండి రిజర్వాయర్ చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న ఎత్తైన బయ్యన్నగుట్టల్లో ఆది మానవుని శిలా విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రకృతి రమణీయత మధ్య గుట్టపైన వెలసిన కోనేరులు, సెలయేరులు వింత అనుభూతిని కలిగిస్తాయి. ఈ గుట్టలపైన పరిసర ప్రాంతంలో వ్యవసాయానికి అనుగుణంగా సారవంతమైన భూమి కూడా ఉంది. ఇక్కడే ఒక పెద్ద సెలయేరు, మూడు కోనేరులు, బంగారు బావిగా పిలవబడే బావి, రాతి కట్టడాలు, ప్రహరీ నిర్మాణాలు దర్శనమిస్తాయి. శిథిలమైన నాటి సాంకేతిక నైపుణ్యతకు ఇవి గుర్తులుగా కనిపిస్తాయి. శిలాతోరణాలు, చిన్న నీటి గుంతలు, ప్రాచీన మానవుడు పూజించిన శిథిలమైన ఆలయాలు, శిలలపై ఆదిమానవుని లిపి, క్రమపద్ధతిలో నిర్మించిన రాతి కట్టడాలు, శిలలను పగులదీసి సాగునీటికై నిర్మించుకున్న కాలువలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. గుట్ట పైభాగాన హనుమాన్ ఆలయం ఉన్నది.
ఆదిమానవుని అవశేషాలు..
ఈ గుట్టల్లో ఆదిమానవుడు నివసించిన రాతి గుహలు, వారికి సంబంధించిన ఆవశేషాలు ఇక్కడ దర్శనమిస్తాయి. నీరు నిలువ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న రాతి గుంతలు, వంట చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న రాతి పొయ్యిలు, రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రాచీనకాలంలోనే నాగరికత ప్రస్ఫుటంగా విలసిల్లిందనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు. గుట్టపై కొలనులో వెలసిన బంగారుబావి, నాటి సమాజానికి శిథిల గుర్తులుగా నేటికీ కనిపిస్తున్నది.
బయ్యన్న దేవుడు
నాటి కాలంలో సరైన సమయంలో వర్షాలు కురియకపోతే ఈ గుట్టలపై వెలసిన బయ్యన్న దేవుడిని ఆరాధిస్తూ కొలిచేవారని తెలుస్తోంది. ఇప్పటికీ అదే విశ్వాసంతో ఈ ప్రాంత రైతులు, ప్రజలు సకాలంలో వర్షాలు కురియని పక్షంలో బయ్యన్న దేవుడిని ఆరాధిస్తారు. ఉమ్మాపూర్ చుట్టు పక్క గ్రామాలైన నాగారం, మహ్మదాపూర్, మడద, పోతారం(ఎస్), జిల్లెలగడ్డ, సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట, శివరాంపల్లి, గూడెం, ఆకునూరు, గణపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు వర్షాలు కురిపించాలని వేడుకోవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడి నీరు చాలా పవిత్రమైందని ప్రజలు విశ్వసిస్తారు. మహ్మదాపూర్‌కు చెందిన భక్తులు గుట్టపై బాగాన పదేళ్ల క్రితం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం గుట్టల పైభాగానికి వెళ్లేందుకు మహ్మదాపూర్ నుంచి మిషన్ భగీరథ కోసం ఘాట్ రోడ్డు నిర్మించారు. ప్రతిఏటా శ్రావణ మాసంతో పాటు ఏడాది పొడుగునా ఈ గుట్టల ప్రాంతానికి సందర్శకులు వస్తుంటారు.
వనమూలికలకు నిలయం
బయ్యన్న గుట్టల ప్రాంతంలో రోగనిరోధక వనమూలికలు, వివిధరకాల పండ్ల చెట్లు దర్శనమిస్తాయి. అనేకమంది ఈ ప్రాంతం నుంచి మూలికలు తీసుకెళ్తుంటారు. ఈ గుట్టల పైభాగానికి వెళ్లేటప్పుడు మెలికలు తిరిగిన దారులు, ముళ్లపొదలు, అడవి జంతువుల మధ్య ఉన్న ఈ ప్రాంతం చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. ఖరీదైన గ్రానెట్‌రాయి, పశువుల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న రాతి కట్టడాలు శిథిలమై ఉన్నాయి. ఆనాటి ఆట వస్తువులుగా చెప్పుకునే పచ్చీస గుండ్లు కనువిందు చేస్తాయి. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ప్రాంతం చరిత్రపుటలకెక్కలేదు. ఈ ప్రాంతంపై పురావస్తు శాఖ సైతం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తుంది.
నాడు కేసీఆర్ సందర్శన
8 ఆగస్టు 2015న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మహాసముద్రం గండి రిజర్వాయర్‌ను సందర్శించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ ప్రదేశంలో గడిపారు. ఇది పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని కితాబిచ్చారు. 52 ఏళ్ల క్రితం మహాసముంద్రం చెరువుకు పడిన గండిని పూడ్చడానికి రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాడు. సీఎం హామీ మేరకు ఈ పనులకు రూ.3.87 కోట్లు మంజూరు చేశారు. 332 ఎకరాల ఆయకట్టు కలిగిన మహాసముద్రం గండి పనులు పూర్తికావడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌గా ఉపయోగపడుతుంది. చుట్టూ 20 గ్రామాలకు భూగర్భ జలాలు పెంపొందుతున్నాయి. రైతులకు ఈ రిజర్వాయర్‌తో సాగునీటి సమస్య తీరింది.
ప్రభుత్వంపైనే ఆశలు
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు కావాల్సిన అవసరాలు, నిధులపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మూడురోజుల క్రితం అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ మహాసముద్రం రిజర్వాయర్ ప్రదేశాలను టూరిజం శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఇక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుట్టల పై భాగానికి వెళ్లేందుకు కావాల్సిన రహదారి, మహాసముద్రంలో బోటింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. దీంతో సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం కలిగి ఉండటమే కాకుండా సర్వాయి పాపన్న సంచరించిన ఈ ప్రదేశం పర్యాటక కేంద్రంగా మారుతుందని ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.