Share News

ఆకుకూరలతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Aug 25 , 2024 | 11:19 PM

జహీరాబాద్‌, ఆగస్టు 25: మనం నిత్యం తీసుకునే ఆహారంతోపాటు ఆకుకూరలను కలుపుకుని తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని పోషకాహార నిపుణులు డా. సలోమియేసుదాస్‌ పేర్కొన్నారు.

ఆకుకూరలతో సంపూర్ణ ఆరోగ్యం
ఆకుకూరల ప్రయోజనాల గురించి డీడీఎస్‌ సభ్యులను అడిగి తెలుసుకుంటున్న సందర్శకులు

ఆకుకూరల సంప్రదాయాన్ని సమాజానికి పరిచయం చేద్దాం

పోషకాహార నిపుణులు డాక్టర్‌ సలోమియేసుదాస్‌

జహీరాబాద్‌, ఆగస్టు 25: మనం నిత్యం తీసుకునే ఆహారంతోపాటు ఆకుకూరలను కలుపుకుని తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని పోషకాహార నిపుణులు డా. సలోమియేసుదాస్‌ పేర్కొన్నారు. ఆదివారం జహీరాబాద్‌ మండలంలోని అల్గొల్‌లో గల కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం-డెక్కన్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ)-డీడీఎస్‌ ఆధ్వర్యంలో ఆకుకూరల పండుగను నిర్వహించారు. ముందుగా వారంతా ఝరాసంగం మండలంలోని పొట్టిపల్లిలో డీడీఎస్‌ మహిళా సంఘం నాయకురాలు పొట్టిపల్లి మొగులమ్మ పంట పొలాన్ని సందర్శించారు. పొలాల్లో ఏ రకమైన ఆకుకూరలు దొరుకుతాయని, తదితర వివరాలను అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం జహీరాబాద్‌ మండలంలోని అల్గొల్‌ గ్రామ శివారులో గల కేవీకేలో నిర్వహించిన సమావేశంలో సందర్శకులు, మహిళలు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రకృతిలో సహజసిద్ధంగా ఐదు రకాలకు పైగానే గడ్డి మొక్కలు ఉంటాయన్నారు. అందులో ఆకుకూరలు, ఔషధ మొక్కలు, కలుపు మొక్కలు, కంపోస్టు ఎరువు తయారీకి ఉపయోగపడే మొక్కలు, పశువులకు మేతగా ఉపయోగపడే మొక్కలు ఉంటాయన్నారు. సహజసిద్ధంగా లభించే ఆకు కూరలకంటూ ప్రత్యేకంగా విత్తనాలు దొరకవని, వాటంతట అవే భూమిపై, పంట పొలాల్లో మొలకెత్తుతాయని పేర్కొన్నారు. ఒక్కో ఆకుకూరతో ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుందని, 40 రకాల ఆకుకూరల వివరాల గురించి వివరించారు. గత 20 ఏళ్ల కిందటే డీడీఎస్‌ ఆధ్వర్యంలో సాగుచేయని ఆకుకూరలపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌(ఎన్‌ఐఎన్‌) వారితో కలిసి పరిశోధనలు చేశామన్నారు. తమ పరిశోధనల ద్వారా మార్కెట్‌లో లభించే ఆకు కూరలకంటే సహజ సిద్ధంగా లభించే ఆకు కూరల్లో చాలా పోషకాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. నేటికీ ఆకు కూరలు మరిచిపోకూడదనే సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని.. డీడీఎ్‌స-కేవీకే ఆధ్వర్యంలో ప్రతియేటా ఆకుకూరల పండుగను చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జీవవైవిధ్య రైతులు లక్ష్మమ్మ, చంద్రమ్మ, మొగులమ్మ మాట్లాడుతూ పంట పొలాల్లో సహజంగా లభించే ఆకుకూరలను కలుపు మొక్కలుగా పరిగణిస్తూ.. రైతులు రసాయనాలను పిచికారీ చేయడంతో వాటి ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. మనం మరిచిపోతున్న ఆకుకూరలకు మార్కెట్లో మరింత డిమాండ్‌ ఉందని వారు గుర్తుచేశారు. సహజంగా తుమ్మికూర, తట్టెల్లి, అడవిమెంతం, జొన్నచెంచలి, అడవిసోయ, దొగ్గలి, ముల్లుదొగ్గలి, బంకంటి, పెత్తకాశ, ఎర్రకాశ, తెల్లబచ్చలి, ఎర్ర, తెల్లపుండి, ఉత్తరేణి, దూసరి, చెన్నంగి, తగిరెంచ తెల్లగర్జ, చామగడ్డ, పోతపత్రం, ఎర్రగర్జ, సన్నవాయి, నాగచెవిలి, గునుగు, మునగకూర, సన్నవాయిలి, ఎర్రగునుగు, చిత్రమళం, తడకదొగ్గలి, గంగవాయిలి, చిన్నకాశ, పప్పుకేర, గుర్మాశి తదితర ఆకూరలు లభిస్తాయని వివరించారు. ఇదిలా ఉండగా సందర్శకులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన సభ్యులు ఆకుకూరల వినియోగం, పండించే విధానంపై డీడీఎస్‌ మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. డీడీఎస్‌ మహిళా రైతులు 20 రకాల ఆకుకూరలతో తయారుచేసిన వంటల భోజనం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకు కూరల రుచులను చూసి సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేవీకే శాస్త్రవేత్తలు శైలజ, రమేష్‌, డీడీఎస్‌ ఉద్యోగులు మాణిక్యం, జనరల్‌నర్సమ్మ, చిన్ననర్సమ్మ, మంజుల, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2024 | 11:19 PM