Share News

దేశంలో నియంతృత్వ పాలన

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:12 PM

హుస్నాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 15: దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఆలోచనతో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పనిచేసే పార్టీలను ఎన్నుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

దేశంలో నియంతృత్వ పాలన
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

రాజకీయాల్లోకి గుండాలు.. హంతకులు

ఫోన్‌ ట్యాపింగ్‌ దుర్మార్గపు చర్య.. బాధ్యులెవరైనా శిక్షార్హులే

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 15: దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఆలోచనతో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పనిచేసే పార్టీలను ఎన్నుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోమవారం హుస్నాబాద్‌ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో చాడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుండాలు, హంతకులు, నేరచరిత్ర కలిగిన వారు, వ్యాపారులు, ధనవంతులు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడంతో రాజకీయాలకు విలువలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీజేపీ పాలనలో మోదీ ఇచ్చిన హామీల్లో కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జన్‌ధన్‌ ఖాతాల వల్ల ఒక్క పేదవాడికైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోషించినంతగా, పేదల సమస్యలు తీర్చలేని బీజేపీని, ఈ ఎన్నికల్లో గద్దెదించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. వామపక్షాలను అంతం చేయాలన్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాదించలేకపోయాయన్నారు. ఇందుకు మునుగోడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కృషిచేసిన వామపక్షాలను కేసీఆర్‌ తొక్కిపడేయాలన్న అహంకారాన్ని తదుపరి జరిగిన ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆయా పార్టీలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్‌ వందరోజుల పరిపాలన ప్రజా ఆకాంక్షల వైపు పయనిస్తోందని, ఇదే పాలన చివరి వరకు ఇచ్చిన వాగ్దానాలు పరిపూర్ణం చేసేందుకు పనిచేస్తుందని ఆశిస్తున్నామన్నారు. సీపీఐ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పనిచేస్తుందన్నారు. తెలంగాణలో 5 పార్లమెంట్‌ సీట్లు ఇవ్వాలని కోరామని, కనీసం ఒక్క సీటైనా ఇవ్వాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి గడిపె మల్లేశం, ఎడల వనేష్‌, సంజీవరెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:12 PM