Share News

తవ్వారు.. వదిలేశారు..

ABN , Publish Date - Aug 18 , 2024 | 11:59 PM

నిలిచిన బస్సు సౌకర్యం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ప్రజలు

తవ్వారు.. వదిలేశారు..
గుంతలతో బురదమయంగా రామారం రోడ్డు

రాయపోల్‌, ఆగస్టు 18: మరమ్మతుల కోసం రెండేళ్ల క్రితం రోడ్డును తవ్వారు. పైన మొరం పోసి వదిలేశారు. దీంతో ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిచిపోయింది. బస్సులు రాకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయపోల్‌ మండలం సయ్యద్‌నగర్‌, రామారం, గొల్లపల్లి గ్రామాల విద్యార్థులు విద్యాభ్యాసం కోసం గజ్వేల్‌కు వెళ్తుంటారు. చాలా కాలం నుంచి గజ్వేల్‌ నుంచి చేగుంట వెళ్లడానికి గుర్రాలసోఫా, సయ్యద్‌నగర్‌, రామారం, గొల్లపల్లి, దౌల్తాబాద్‌ మండలం ఇందుప్రియాల్‌, మహమ్మద్‌షాపూర్‌, లింగాయపల్లితండా, గొడుగుపల్లి మీదుగా ఆర్టీసి బస్సులు నడుస్తున్నాయి. సుమారు మూడేళ్ల క్రితం రోడ్డు గుంతలమయంగా మారడంతో ఆర్టీసీ వారు రోడ్డు బాగు చేయిస్తేనే బస్సులు నడిపిస్తామని మానేశారు. ఆయా గ్రామాల విద్యార్థులు గుర్రాలసోఫా వద్ద బస్సుల కోసం పలుమార్లు ధర్నా నిర్వహించారు. దీంతో విద్యార్థుల కోసం విద్యాసంస్థలు తెరిచి ఉన్న రోజు ఓ బస్సును ఆ గ్రామాల గుండా నడిచేందుకు ప్రారంభించారు. అయితే రెండేళ్ల క్రితం గుర్రాలసోఫా నుంచి రామారం వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు పునఃనిర్మాణం కోసం కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌ రోడ్డును తవ్వి మొరం మాత్రం పోశాడు. మిగతా పనిని నిలిపివేశాడు. దీంతో విద్యార్థుల కోసం నడిచే ఆ ఒక్క బస్సు కూడా బంద్‌ అయింది. కేవలం విద్యాసంస్థలు తెరిచి ఉన్న రోజున మాత్రం మెయిన్‌ రోడ్‌ వెంబడి ఓ బస్సును నడిపిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు, ప్రజలు గుర్రాలసోఫా వద్దకు నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తున్నది. అది కూడా ప్రభుత్వ పని దినాలు ఉన్న రోజునే బస్సును నడుపుతున్నారు.

Updated Date - Aug 18 , 2024 | 11:59 PM