జ్వరమొచ్చింది..
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:09 AM
‘దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి పదిరోజుల క్రితం నిత్యం 209 మంది వైద్యపరీక్షల కోసం వచ్చేవారు. శుక్రవారం ఔట్ పేషెంట్ల సంఖ్య 316కు చేరింది. జ్వరాలు, వాంతులు, విరేచనాలతోపాటు కీళ్లనొప్పుల చికిత్సకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది’
- రోగులతో ఆస్పత్రులు కిటకిట
- ప్రబలుతున్న డెంగీ, వైరల్ ఫీవర్
- వాంతులు, విరేచనాలు, కీళ్లనొప్పుల బాధలు
- క్రమంగా పెరుగుతున్న ఔట్ పేషెంట్ల సంఖ్య
- క్షేత్రస్థాయిలో అవగాహన కరువు
- సమయపాలన పాటించని వైద్యసిబ్బంది
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై 26 : ‘దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి పదిరోజుల క్రితం నిత్యం 209 మంది వైద్యపరీక్షల కోసం వచ్చేవారు. శుక్రవారం ఔట్ పేషెంట్ల సంఖ్య 316కు చేరింది. జ్వరాలు, వాంతులు, విరేచనాలతోపాటు కీళ్లనొప్పుల చికిత్సకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది’
‘అక్కన్నపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉండగా ఉదయం 11 దాటినా ఒక్కరు కూడా రాలేదు. స్టాఫ్ నర్సు నాగమణి రోగులను పరీక్షించి మందులు అందజేశారు. జ్వరం, దగ్గు, విరేచనాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఎక్కువగా వస్తున్నారు. ఇక ముగ్గురికి డెంగీ పాజిటివ్‌గా తేలింది.’
ఈ పరిస్థితులు అక్కన్నపేట, దుబ్బాక ఆస్పత్రిలోనే కాదు... జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిత్యకృత్యంగా మారింది. జర్వం, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న చికిత్స కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. అయితే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. వంతులవారీగా వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
వానాకాలం సీజన్‌ను వ్యాధుల సీజన్‌గా పరిగణిస్తుంటారు. వర్షాల మూలంగా వాతావరణ ప్రభావంతో రోగా లు ప్రబలుతుంటాయి. ఈ క్రమంలోనే జిల్లాలో డెంగీ, వైరల్ ఫీవర్, ఇతర జ్వరాల ఉధృతి పెరుగుతున్నది. వీటిని నియంత్రించడానికి క్షేత్రస్థాయిలో వైద్యారోగ్యశాఖ అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులపై సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. కానీ అవేవీ లేనట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితిపై శుక్రవారం జిల్లాలో ’ఆంధ్రజ్యోతి’ చేపట్టిన పరిశీలనలో పలు విషయాలు బహిర్గతమయ్యాయి.
ఒక్కరోజే 1430 మందికి జ్వరాలు
జిల్లాలో 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 అర్బన్ హెల్త్‌సెంటర్లు, బస్తీ దవాఖానలు, గజ్వేల్‌లో జిల్లా ఆస్పత్రి, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, నంగునూరులో సీహెచ్‌సీ ఆస్పత్రులున్నాయి. శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6071 మంది ఔట్ పేషెంట్లు(ఓపీ)కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1430 మంది సీజనల్ జ్వరాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. రోగులతో ప్రభుత్వాస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 7 డెంగీ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. మరో రెండునెలల పాటు వర్షాలు కురిసే నేపథ్యంలో ఇంకా వ్యాధుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు భావిస్తున్నారు.
అవగాహన కరువు
వర్షాకాలంలో పాటించాల్సిన రక్షణ చర్యల గురిం చి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. వ్యాధులు ప్రబలకముందే ఇంటింటా తగిన సూచనలు ఇవ్వాల్సి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జ్వర సర్వేతో బాధితులకు అవసరమైన సూచనలతోపాటు ఇతర రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు అందుతాయి.
పెరుగుతున్న జ్వరపీడితుల సంఖ్య..
బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పదిరోజుల క్రితం నిత్యం 65 మంది ఔట్ పేషెంట్లు రాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 90కి చేరింది.
అక్కన్నపేట పీహెచ్‌సీలో ఓపీ విభాగం 50 నుంచి 80కి చేరింది.
చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత నెలకొన్నది. ఇక్కడికి దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరం, వాంతులు, విరేచనాలతో పేషెంట్లు వస్తున్నారు. ఒకరిద్దరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
మద్దూరు మండలం లద్నూరులోని పీహెచ్‌సీలో ఇన్‌చార్జి డాక్టర్ ఎప్పుడో ఒకసారి వస్తున్నారు. మిగితావారు వంతులవారీగా విధుల్లో ఉంటున్నారు. పేషెంట్లు వైద్యుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
మద్దూరులోని పీహెచ్‌సీలో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇక యునానీ దవాఖానా రోజుల తరబడిగా తెరుచుకోవడం లేదు. డాక్టర్, ఫార్మసిస్టు విధులకు సరిగా హాజరుకావడం లేదనే విమర్శలున్నాయి.
కుకునూరుపల్లి పీహెచ్‌సీలో ఓపీ సంఖ్య 85 నుంచి 100కు చేరింది. ఎక్కువగా జ్వరం, దగ్గు, కీళ్లనొప్పుల బాధితులు వస్తున్నారు.
హుస్నాబాద్‌లో నిత్యం 280 నుంచి 300 మంది సీజనల్ వ్యాధులతో వైద్యపరీక్షలకు వస్తున్నారు. 30 మంది పరిస్థితి క్షీణించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 1005 మంది, గజ్వేల్ జిల్లా ఆస్పత్రిలో 400 మంది ఓపీలో రిజిస్టర్ చేసుకున్నారు.
ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
సిద్దిపేటఅర్బన్, జూలై26: సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శుక్రవారం ఆమె సిద్దిపేట అర్బన్ మండలం బక్రి చెప్యాలలో జిల్లా వైద్యాధికారి శ్రీనివా్‌సతో కలిసి పర్యటించిన అనంతరం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులనుద్దేశించి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్నందున వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, ఇంటి పరిసరాల్లో దోమ లు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సీజన్‌లో డయోరియా వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు వేడినీటిని చల్లార్చుకుని తాగాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పిల్లలకు అందుతున్న ఆహారం, పిల్లల ఆరోగ్యం, గర్భిణులకు, స్ర్తీలకు అందుతున్న ఆరోగ్యసేవల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి నమూనాలను సేకరించి పరీక్షలను నిర్వహించి తగిన చికిత్స అందించాలని మండల, గ్రామస్థాయి వైద్యసిబ్బందికి సూచించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ వైద్యాధికారి రేవతి, డీపీవో దేవకి దేవి, ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్, ఆరోగ్య సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.
వైద్యులు బదిలీ.. వారి స్థానాలు ఖాళీ
హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో సకాలంలో అందని వైద్యసేవలు
హుస్నాబాద్, జూలై 26 : దాదాపు వంద గ్రామాలకు కేంద్రమైన హుస్నాబాద్ ప్రభుత్వ సామాజిక వైద్యఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఆర్థోపెడిక్, అనిస్తీషియా, పిడియాట్రిక్, డెంటల్ వైద్య నిపుణులు బదిలీ అయ్యారు. ఆ స్థానాలను బర్తీ చేయకపోవడంతో సకాలంలో వైద్యసేవలు అందక రోగులు అవస్థలు పడుతున్నారు. నిత్యం 300 మందికి పైగా ఓపీ ఉండే ఈ 50 పడకల ఆసుపత్రిలో గైనకాలజిస్టు, డ్యూటీ డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో పనిచేసేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా స్థానాల్లో వైద్యనిపుణులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సేవలు ప్రారంభం
మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ సేవలకే పరిమితమైన హుస్నాబాద్ ఆసుపత్రిలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టు హెల్త్ స్కీం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆసుపత్రిలో శుక్రవారం ఈ సేవలు ప్రారంభం కాగా ఒక ఉద్యోగికి ఈ స్కీం ద్వారా డయాలిసిస్ చేశారు.