భూముల ఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువ
ABN , Publish Date - Aug 27 , 2024 | 11:12 PM
ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయా గ్రామాల్లో ఆక్రమణలకు గురైన భూములు, చెరువులు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయా గ్రామాల్లో ఆక్రమణలకు గురైన భూములు, చెరువులు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఫిర్యాదు చేస్తున్నారు.
ములుగు, ఆగస్టు 27: బండతిమ్మాపూర్ గ్రామ శివారులో ఉన్న పాలసముద్రం చెరువు భూమిని ఓ కంపెనీకి చెందిన వ్యక్తులు ఆక్రమించి రాత్రికిరాత్రి ప్రహరీ నిర్మించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, యువకులు మంగళవారం చెరువు భూముల్లో అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించాలని తరలివచ్చారు. కంపెనీ నిర్వాహకులు చెరువు భూమిని ఆక్రమిస్తున్నారని నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ చెరువు భూమిలో అక్రమ కట్టడాలను అరికట్టాలన్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా.. రెండురోజుల్లో పోలీసుల సహాయం తీసుకుని ప్రహరీని తొలగిస్తామని ఇరిగేషన్ ఏఈ అస్సాం తెలిపారు.
ప్రభుత్వ భూముల స్వాధీనం సరైనదే
కొండపాక, ఆగస్టు 27: ప్రభుత్వ భూముల స్వాధీనం సరైనదేనని జాతీయ మానవ హక్కుల కమిటీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బద్దిపడిగ నరసింహారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత సంస్థ ‘హైడ్రా’ నిర్వహిస్తున్న ఆక్రమణల తొలగింపులకు మద్దతుగా ఆయన ఆధ్వర్యంలో వివిధ మండలాల అధ్యక్షుల సమక్షంలో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందజేసి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైడ్రా అనే సంస్థ ఆధ్వర్యంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి తీసుకున్న చర్యలు ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిటీ కొమురవెల్లి, కుకునూరుపల్లి, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, మర్కుక్ మండలాల అధ్యక్షులు బొడుగం కృష్ణారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, తెలకలపల్లి బాల్‌రెడ్డి, ఆరే శ్రీకాంత్, ఏల్లు రామ్‌రెడ్డి, సాయిరెడ్డి, రామ్‌రెడ్డి పాల్గొన్నారు.
కాలువను కబ్జా చేసిన వారి పై చర్యలు తీసుకోవాలి
చిన్నకోడూరు, ఆగస్టు 27: మండలంలోని ఎల్లాయిపల్లి పెద్దగండి చెరువుకు అనుసంధానంగా ఉన్న కాలువను కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మైలారం గ్రామస్థులు కోరారు.మంగళవారం చిన్నకోడూరు తహసీల్దార్ జయలక్ష్మికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కాలువను పునరుద్ధరిస్తే సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
కబ్జాకు గురైన చెరువులపై అధికారులు దృష్టిపెట్టాలి: బీజేపీ
గజ్వేల్, ఆగస్టు 27: గజ్వేల్ పట్టణంలో కబ్జాకు గురైన చెరువులపై అధికారులు దృష్టి సారించి, వెంటనే చెరువులను కాపాడాలని బీజేపీ గజ్వేల్ పట్టణాధ్యక్షుడు దేవులపల్లి మనోహర్‌యాదవ్ డిమాండ్ చే శారు. గజ్వేల్‌లోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను మట్టితో చదును చేసి వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారని, దీంతో చెరువుల విస్తీర్ణం తగ్గిపోతుందన్నారు. గజ్వేల్ చెరువులకు వెంటనే ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ను ఏర్పాటు చేసి రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట బీజేపీ నాయకులు అయిల మహేందర్, నాయిని సందీప్, చెప్యాల వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.